హైదరాబాద్ లో భారీ వాన.. వరదనీటితో నిండిపోయిన కాలనీలు, గల్లీలు

హైదరాబాద్ లో భారీ వాన..  వరదనీటితో నిండిపోయిన కాలనీలు, గల్లీలు

హైదరాబాద్ లో కుండపోత వర్షం పడింది. సికింద్రాబాద్, కంటోన్మెంట్, బేగంపేట్, రాణిగంజ్,  ప్యాట్నీ, కార్కానా,  బోయిన్ పల్లి, సీతాఫల్ మండి, వారాసిగూడ, బోరబండ, యూసుఫ్ గూడ, రెహమత్ నగర్, అడ్డగుట్ట, మహేంద్రహిల్స్,  కూకట్ పల్లి,  హైటెక్ సిటీ,  మాదాపూర్,  జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మారేడ్ పల్లి తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు చేరింది. కాలనీలు, గల్లీలు వరదనీటితో నిండిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం  ఏర్పడింది.

ఇక సిటీ రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులకు తిప్పలు తప్పలేదు. ఇక బోరబండలోని ఓ కాలనీలో వరద…. నదీ ప్రవాహాన్ని తలపించింది. ఎగువ కాలనీల నుంచి కొన్ని కార్లు కొట్టుకు వచ్చాయి. రోడ్లపై పార్కింగ్ చేసిన బైక్ లు కూడా కొట్టుకుపోయాయి. కొన్ని ఇండ్లలోని ఫర్నీచర్ కూడా కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఇక పలు ప్రాంతాల్లో కరెంట్ కూడా లేక జనం అవస్థలు పడ్డారు.

బాలానగర్లో అత్యధికంగా 10.4 సెంటీ మీటర్ల వాన పడింది. అల్వాల్ మచ్చ బొల్లారంలో 9.6, తిరుమగిరిలో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెస్ట్ మారేడుపల్లిలో 9.3, కుత్బుల్లా పూర్ లో 9.2, ఆర్సీపురంలో 9.1 సెంటీ మీటర్ల వాన పడింది. అటు జిల్లాలోను భారీ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా రామారంలో 16.3 సెంటీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో 13.4, సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో 12. సెంటీ మీటర్ల వర్షం పడింది.

రాత్రి వర్షానికి చాలా ఏరియాల్లో నీరు నిలచిపోయింది. లోతట్టు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు రాత్రి వర్షానికి ఇండ్లలోకి నీరు రావటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే పరిస్థితి అంటున్నారు. నిత్యవసరాలు తడిసిపోయాయని వాపోతున్నారు.