3 రోజుల పాటు భారీ వర్షాలు

3 రోజుల పాటు భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ, రేపు 24 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఎల్లుండి మరో 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కొనసాగుతుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఇవాళ అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు అలెర్ట్ జారీ చేశారు. నిన్న అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లాలో 13.3 సెంటీమీటర్లు, జగిత్యాలలో 10.5 సెంటీమీటర్లు, నల్గొండలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

లోతట్టు ప్రాంతాలు ఆగమాగం

గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలకు హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలు ఆగమాగమయ్యాయి. ఇప్పటికీ పలు కాలనీల్లో నీరు నిలిచిపోయింది. వరుస వానలకు హైదరాబాద్ రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఎక్కడ గుంతలు ఉన్నాయో..ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. హైదర్ గూడ నుంచి బషీర్ బాగ్ వెళ్లే రహదారిపై పూర్తిగా నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నీరు చేరింది. బేగంపేట, పంజాగుట్ట, కోఠి, లిబర్టీ, హిమయత్ నగర్, రేతిబౌలి, చంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, మలక్ పేట్ ప్రాంతాల్లో నిలిచిన వర్షం నీటికి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. 

కుండపోత వర్షం

జూన్ లో రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు. మరో 15 రోజుల్లో నిష్క్రమించనున్నాయి. పోతూపోతూ కుండపోత వర్షాన్ని కురిపిస్తున్నాయి. బంగాళాఖాతం పశ్చిమ, మధ్యప్రాంతంలో గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించింది. మరోవైపు తూర్పు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అక్టోబర్ ఒకటిన ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.