
- కొనుగోలు కేంద్రాల్లోకి వరద.. కొట్టుకుపోయిన వడ్లు
- ఈదురుగాలులకు నేలరాలిన మామిడి
వెలుగు నెట్‌వర్క్ : దుక్కి దున్నిన నాటి నుంచి వరి కోసే వరకు ఎన్నో కష్టనష్టాలను భరించి పంట పండించిన రైతన్నకు.. ఆ పంట చేతికొచ్చిన టైంలో కురుస్తున్న వానలు తీరని వేదన మిగులుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి, మంగళవారం భారీ వర్షం పడింది. దీంతో వడ్లు తడిసి, మామిడికాయలు రాలిపోవడంతో రైతులకు తీవ్రం నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా భారీ వర్షం పడడం.. వడ్లన్నీ కొట్టుకుపోతుండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రైతులు పడిపోయారు. కొనుగోలు కేంద్రాలు, రోడ్ల పక్కన ఆరబోయిన వడ్లు నీటిలో కొట్టుకుపోతుంటే వాటిని కాపాడుకునేందుకు నానా అవస్థలు పడ్డారు.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి పడిన వర్షంతో రైతులకు భారీగా నష్టం జరిగింది. అక్కన్నపేట, కొండపాక, కోహెడ మండలాల్లో మామిడికాయలు రాలిపోయాయి. జగదేవ్‌పూర్, గజ్వేల్, దౌల్తాబాద్, బెజ్జంకి, మద్దూరు, ధూల్మిట్ట, రాయపోల్ మండలాల్లో కోతకు వచ్చిన వరి నేల పాలైంది. చిన్నకోడూరు మండలం మెట్‌పల్లికి చెందిన బెస్సి చంద్రయ్యకు చెందిన రెండు గేదెలు, కోహెడ మండలం తీగలకుంటపల్లికి చెందిన రాగుల మల్లేశానికి చెందిన ఓ గేదె పిడుగుపాటుతో చనిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిసిపోగా, సిద్దిపేట మార్కెట్ యార్డులో నీటిలో కొట్టుకుపోయాయి. ఈదురుగాలులకు అక్కన్నపేట మండలం ధర్మారం, కోహెడలో రెండు ఇండ్ల రేకులు ఎగిరిపోయాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాను అకాల వర్షం అతలాకుతలం చేసింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడడంతో చెట్లు కూలిపోగా, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు విరిగిపడ్డాయి. హసన్‌పర్తి, ఎల్కతుర్తి, ధర్మసాగర్, వరంగల్ చుట్టూ ఉన్న పలు గ్రామాల్లో రైతులు ఆరబోసిన వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల బస్తాలు తడిసిముద్దయ్యాయి. పలు గ్రామాల్లో మామిడికాయలు రాలిపోయాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని పలు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. గాలులకు ధర్మసాగర్ మండలంలో షెడ్డు కూలి 30 మేకలు చనిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లను హనుమకొండ డీసీవో సంజీవరెడ్డి పరిశీలించి, తడిసిన వడ్లను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
యాదాద్రి జిల్లాలోని ఆలేరు, భువనగిరి, యాదగిరిగుట్ట, తుర్కపల్లి సహా పలు మండలాల్లో సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. విపరీతమైన వేగంలో గాలులు వీయడం వల్ల తోటల్లోని మామిడి కాయలు రాలిపోయాయి. కొనుగోలు సెంటర్లలోని వడ్లు తడిచిపోయాయి. ఈదురుగాలుల కారణంగా దాదాపు 50 కరెంట్ పోల్స్ కూలిపోయినట్లు తెలుస్తోంది. దీంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
ఖమ్మం జిల్లాలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన రాళ్లవాన బీభత్సం సృష్టించింది. ఖమ్మం నగరంలో పలుచోట్ల హార్డింగ్స్ కింద పడ్డాయి. సారథినగర్ రైల్వే అండర్ బ్రిడ్జి కింది నీళ్లు నిలిచిపోయాయి. చెట్లు కొమ్మలు విరిగిపడడంతో వైరా, తల్లాడ రూట్‌లో గంటకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. పలు మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోయాయి.