ఏపీలో వర్ష బీభత్సం.. పొంగి పొర్లుతున్న నదులు

ఏపీలో వర్ష బీభత్సం.. పొంగి పొర్లుతున్న నదులు

ఏపీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వర్షాలు, వరదలతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక తిరుపతి, తిరుమలలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో వరదలు నష్టం చేకూర్చాయి. అన్నమయ్య జలాశయం కట్ట తెగడంతో వరద నీటిలో పులపుత్తూరుకు చెందిన 12 మంది గల్లంతైనట్లు బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. వీరిలో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. మిగిలిన మృతదేహాల కోసం ఇటు అధికారులు, అటు బంధువులు వెతుకుతున్నారు. మందపల్లిలో పదిమంది కొట్టుకుపోగా అందులో ఒకరి మృతే దొరికింది. మరో 9 మంది కోసం గాలిస్తున్నారు. 

నెల్లూరు జిల్లాలో పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 16వ నెంబరు జాతీయ రహదారికి గండి పడి..నెల్లూరు, విజయవాడ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వాహనదారులు కడప, పామూరు, దర్శి వైపు వెళ్లాలని సూచించారు అధికారులు. అటు... భారీ వర్షాలతో చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో 172 మండలాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీటిలో చిత్తూరులో అత్యధికంగా 66 , అనంతపురంలో 46, కడపలో 48 మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో వర్షాలతో తీవ్ర ఆస్తినష్టం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. ఇక ఇప్పటివరకు అధికారికంగా 24 మంది వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారని చెప్పారు అధికారులు. ఇంకా 17 మంది గల్లంతయ్యారని తెలిపారు. 

భారీ వర్షాలతో దాదాపు 23వేల 994 మంది ప్రభావితం అయ్యారని ప్రభుత్వం తెలిపింది. ఈ నాలుగు జిల్లాల్లోనూ వర్షాల కారణంగా దాదాపు 70వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. మరో 45వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు చెబుతున్నారు అధికారులు.  జిల్లాల్లో సహాయ కార్యక్రమాల కోసం తక్షణ సాయంగా 7 కోట్ల రూపాయలను విడుదల చేసింది ఏపీ సర్కార్. ఇప్పటికే సహాయ శిబిరాల్లో ఉంటున్న ప్రతి కుటుంబానికి 2 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నట్టు ప్రభుత్వం అధికారులు తెలిపారు. రోడ్లు, విద్యుత్ సరఫరా కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు భారీ వర్షాలకు కడప జిల్లా కమలాపురంలో పాపాగ్ని నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. నిత్యం రాకపోకలు సాగించే ఈ బ్రిడ్జి కూలిపోవడంతో కమలాపురం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటికి పిల్లర్లు కుంగిపోవడంతో.. వంతెన కూలింది. ప్రకాశం జిల్లా వెల్లాలచెరువు గ్రామం దగ్గర రైల్వే అండర్ పాస్ లోకి భారీగా వర్షపు నీరు చేరి అవస్థలు పడుతున్నారు జనం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు విన్నవించారు. అధికారులు స్పందించకపోవడంతో ప్యాసింజర్ రైలు ఆపి నిరసన తెలియజేశారు గ్రామస్తులు. మరోవైపు ఏపీలో వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకోవాలని పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వరద బాధితులకు అండగా ఉండాలని, అవసరమైన సహాయం చేయలంటూ కార్యకర్తలకు పిలుపునిస్తూ ట్వీట్ చేశారు రాహుల్.