మధ్యప్రదేశ్​లో ఎడతెరపి లేని వాన .. పిడుగు పాటుకు నలుగురు మృతి

మధ్యప్రదేశ్​లో ఎడతెరపి లేని వాన .. పిడుగు పాటుకు నలుగురు మృతి

భోపాల్: మధ్య ప్రదేశ్​లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగు పాటుకు గురై నలుగురు మృతి చెందారు. ముకేశ్ (28), అతడి భార్య చంపా (27) ఉమర్బన్ గ్రామంలోని తమ ఇంటికి బైక్​పై వస్తుండగా పిడుగు పడటంతో అక్కడిక్కడే మృతి చెందారు.  వారి కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. లుంగ్జి కటారా (45) అనే మరో వ్యక్తి పిడుగుపాటుకు గురై మరణించారు. ఆదివారం సాయంత్రం ఝవాలియా గ్రామంలోని  పొలంలో పని చేసుకుంటుండగా ఈ ఘటన జరిగింది. బర్వానీ జిల్లాలోని జునాజీరా గ్రామంలో ఓ మహిళ కూడా పిడుగు పాటుతో మృతి చెందారు.

పలు ప్రాంతాల్లో భారీ వర్షం: 

మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లో 100 మీమీ కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని ఝబవా జిల్లా వర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది. ఆ ప్రాంతంలో దాదాపుగా 110.3 మీమీల వర్షం కురిసింది. బర్వానీ జిల్లాలో 109 మీమీల వర్షపాతం నమోదైంది.