తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దీంతో తెలంగాణ రాష్ట్రం అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న భారీ వానలు, వరదల నేపథ్యంలో... ఇంకా భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు కొట్టుకపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో కాలనీలు నీట మునగడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. వరద ఉండటంతో బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నామని అపార్ట్ మెంటు వాసులు ఆందోళన చెందుతున్నారు.
