అకాల వర్షం.. తడిసిన ధాన్యం.. నర్సంపేటలో దంచికొట్టిన వర్షం..

అకాల వర్షం.. తడిసిన ధాన్యం.. నర్సంపేటలో దంచికొట్టిన వర్షం..

నర్సంపేట, వెలుగు  :వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం రాత్రి ఈదురుగాలులతో  వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా నర్సంపేట మార్కెట్ యార్డులో రైతులు నిల్వ చేసిన మొక్కజొన్న బస్తాలు తడిసిపోయాయి. కళ్ల ముందే పండిన పంట వర్షానికి   రైతులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఏడాది మక్కజొన్న దిగుబడి బాగా వచ్చినప్పటికీ అకాల వర్షం రైతుల ఆశలను దెబ్బతీసింది. నర్సంపేట డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట మండలాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డు, ఖానాపురం సబ్ మార్కెట్ యార్డు, చెన్నారావుపేట మండల కేంద్రంలోని రెండు కొనుగోలు కేంద్రాల్లో వేల సంఖ్యలో మక్కజొన్న బస్తాలు తడిసిపోయాయి. 

రాశులపై పరదాలు కప్పినా వరద నీరు చేరడంతో కింద భాగంలోని బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. చెన్నారావుపేట కొనుగోలు కేంద్రంలో కొంతమంది రైతుల మక్కలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటికే గన్నీ సంచుల కొరత, గోదాములు , రవాణా లారీలు లేక కొనుగోళ్లు మందగించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఉదయం రైతులు తడిసిన బస్తాలను ఆరబెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. తడిసిన మక్కలను బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నర్సంపేట మార్కెట్ యార్డు ప్రధాన గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. అధికారులు వచ్చి తడిసిన మక్కలను కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.