పత్తి ఖతం! ఎడతెరిపిలేని వానలతో భారీగా పంటనష్టం

పత్తి ఖతం! ఎడతెరిపిలేని వానలతో భారీగా పంటనష్టం
  • చెట్లపైనే ఉండలుగా చుట్టుకొని నేలరాలుతున్న పత్తి 
  • లేటుగా విత్తనాలు నాటిన రైతులకు అపార నష్టం
  • ఎకరానికి 15 క్వింటాళ్లు రావాల్సిన చోట 5 క్వింటాళ్లలోపే దిగుబడి
  • ఈసారి అక్టోబర్ లోనే గులాబీ పురుగు ఉధృతి..నిండా మునిగిన పత్తి రైతు 

హైదరాబాద్, వెలుగు:  ఈ ఏడాది పత్తి రైతులను  భారీ వర్షాలు  నిండా ముంచాయి. వానల వల్ల పత్తిపంట పూర్తిగా దెబ్బతిని చేతికి అందకుండా పోతున్నది. వరుసగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆగమవుతున్నారు. తరుచూ వర్షాలు, మబ్బులకు తోడు, సరిపడా ఎండపొడలేక  పత్తికాయలు పగలడం లేదు.  కొన్ని చోట్ల  చెట్ల మీదనే కుళ్లిపోయి రాలిపోతున్నాయి. మొంథా ఎఫెక్ట్‌‌తో కురుస్తున్న వర్షాలకు చెట్లపైన కాసిన పత్తిని కూడా ఏరుకోలేని పరిస్థితి  నెలకొన్నది. 

లేట్‌‌గా విత్తనాలు నాటిన రైతన్నలకు తొలి క్రాప్​ కూడా అందని పరిస్థితి ఉంది.  జూన్​ మొదటివారంలో పంటలు వేసిన రైతులు పికింగ్​ చేసిన చోట పత్తి రంగు మారి నాణ్యత లేకుండా పోతున్నది. నవంబర్​ చివరాఖరులో కనిపించాల్సిన గులాబీ రంగు పురుగు ఉధృతి అక్టోబర్​లోనే మొదలైంది. 

దీంతో ఆకులు రాలి, చెట్లు మోడువారాయి. పచ్చగా ఉన్న చెట్లకు కాసిన పూత, కాత రాలిపోతున్నది. దీంతో పురుగు మందులు కొట్టలేక, కిందపడిన పత్తిని ఏరడానికి కూలీల ఖర్చులు భరించలేక రైతులు చేతులెత్తేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో చాలా చోట్ల పత్తి చేలను వదిలేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు తల్చుకొని ఆవేదన చెందుతున్నారు.  

జూన్‌‌లో అనావృష్టి.. అక్టోబర్‌‌‌‌లో అతివృష్టి

రాష్ట్రంలో ఏటా జూన్​ మొదటివారంలో వానాకాలం పంటల సీజన్​ స్టార్ట్ అవుతుంది. ఎండాకాలంలో దుక్కులు దున్ని సిద్ధం చేసిన వ్యవసాయ భూముల్లో తొలకరి జల్లులు పడగానే పత్తి విత్తనాలు నాటుతారు. కానీ ఈ ఏడాది జూన్‌‌లో వానలు పడక పత్తి విత్తనాలు నాటడానికి ఆలస్యం అయ్యింది. వ్యవసాయ శాఖ నివేదికల ప్రకారం ఈ ఏడాది ఖరీఫ్‌‌లో రాష్ట్రవ్యాప్తంగా పత్తి పంట సాధారణ సాగు విస్తీర్ణం 48.93 లక్షల ఎకరాలు కాగా.. అనావృష్టి కారణంగా జులై మొదటివారానికి 30.44 లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తి విత్తనాలు వేశారు. 

ఆ తర్వాత కురిసిన వానలతో 45.76 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. నిరుడికంటే ఈ సారి 2 లక్షల ఎకరాల్లో ఎక్కువగా పత్తి సాగైంది. బావులు, బోర్ల కింద నీటి సౌకర్యం ఉన్న చోట రైతులు దుక్కుల్లోనే పత్తి విత్తనాలు నాటి..  వానలు పడకపోయినా డ్రిప్​ పైపుల ద్వారా నీళ్లు పారించి పంటను రక్షించుకున్నారు. లేటుగా విత్తనాలు నాటిని రైతులకు ఈ పరిస్థితి రాలేదు. సెప్టెంబర్, అక్టోబర్​ నెలల్లో తుఫాన్‌‌లు, భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చేతికి అందివచ్చిన పంట దెబ్బతిన్నది. 

రోజు విడిచి రోజు వానలు కురవడం, పట్టుమని వారం రోజుల పాటు ఎండలు కొట్టకపోవడంతో రైతులకు పత్తి ఏరడం సాధ్యం కాలేదు. కొందరు రైతులు కూలీలకు అధిక రేట్లు చెల్లించి పత్తిని ఏరిన ఏరియాలో.. తడిసిన పత్తిని ఆరబెట్టే అవకాశాలు లేకుండా పోయాయి. కుప్పలుగా పోసిన పత్తిలో తేమ శాతం తగ్గడం లేదు. దాదాపుగా అంతటా అదే పరిస్థితి నెలకొంది. 

పడుతున్న పత్తి

పత్తి ఏరే సమయంలో మంచి ఎండ ఉండాలి. కానీ వానలు పడుతుండడం, మబ్బు వాతావరణం వల్ల  పత్తికాయలు పగలడం లేదు. పూత, పిందె దశలో పంట చేన్లలో నీళ్లు నిలిచిపోయి పత్తి మొక్కలు వాడిపోయి ఎర్రబారినయ్‌‌. కొన్ని చోట్ల పత్తికాయలు చెట్ల మీదనే కుళ్లి, రాలిపోతున్నాయి. పత్తి కాయల్లో తేమశాతం పెరగడంతో నల్లబారి మొలకలు వస్తున్నాయి. దీంతో దిగుబడి తగ్గడమే కాకుండా పత్తి నాణ్యత కూడా దెబ్బతింటున్నది. 

తమ కళ్లముందే రాలుతున్న పూత, మురిగిపోయిన కాయలను చూసి పత్తి రైతు కన్నీరు పెడుతున్నాడు. వరుస వర్షాలతో మొదటి దశ పంట కాపుకు నష్టం వాటిల్లింది. ఉన్న కొద్దిపాటి పత్తిని తీసే క్రమంలో తుఫాన్ ఎఫెక్ట్ తో చేన్లోనే తడిసి ముద్దవుతున్నదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని రూ.లక్షల్లో పెట్టిన పెట్టుబడి నీళ్లపాలవుతున్నదని గుండెలు బాదుకుంటున్నారు. . 

5 శాతం తగ్గిన దిగుబడి 

రోగ నిరోధక శక్తిని తట్టుకునే బీటీ 2 పత్తి పంటలను సాగు చేసినా ఈ సారి దిగుబడి 75 శాతం తగ్గిపోయినట్లు వ్యవసాయ శాక అధికారులు చెబుతున్నారు. నల్లరేగడి నేలల్లో ఒక ఎకరానికి సుమారు 15 క్వింటాళ్లు, చెలక భూముల్లో 10 క్వింటాళ్ల వరకు  పత్తి దిగుబడి రావాలి. కానీ ఈ సారి కురిసిన అతి భారీ వర్షాల కారణంగా నల్లరేగడి భూముల్లో 5 క్వింటాళ్లు, చెలక భూముల్లో 3 క్వింటాళ్ల పత్తి కూడా చేతికి వచ్చే పరిస్థితి కనిపించట్లేదని రైతన్నలు చెబుతున్నారు. 

పత్తి కాయలు పగిలి తెల్లని పత్తి చేలల్లో కనిపిస్తున్నా.. ఆ పత్తిని ఏరే అనువైన వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో   నల్లగా మారి నేలపై పడిపోతున్నది. కింద పడిన పత్తిలోని గింజల నుంచి మొలకలు వస్తున్నాయి. ప్రస్తుతం చెట్లకు ఉన్న పూత, కాయలను పరిశీలిస్తే వాటికి గులాబీ రంగు పురుగు ఆశించడం మొదలైంది. గతంలో ఈ పురుగు ఉధృతి నవంబర్​ నెలాఖరులో కనిపించేది. కానీ ఇప్పుడు అక్టోబర్​ నెలలోనే మొదలైంది. వీటి నివారణకు ఇప్పటివరకూ మందు లేకపోవడంతో రైతులు చేసేదేమీ లేక పత్తి పంటను తొలగించి.. ప్రత్యామ్నాయంగా మక్కజొన్న పంటను సాగు చేయాలని భావిస్తున్నారు.

 పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి రంగు మారి అక్కరకు రాకుండా పోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఒక్క ఎకరానికి ఇప్పటివరకు రూ.50 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. కేవలం పత్తి పంట పైనే ఒక్కో ఎకరానికి రూ.30 వేలకు తగ్గకుండా ..రాష్ట్రవ్యాప్తంగా రూ.13 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు రైతు సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. 

సీసీఐ చైర్మన్‌‌కు మంత్రి వెంకట్‌‌రెడ్డి రిక్వెస్ట్​

రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల నష్టపోతున్న పత్తి రైతులను ఆదుకోవాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి కోరారు. ముంబైలో గుప్తాతో మంత్రి  ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

రూ.లక్షన్నర నష్టం!

నేను 4 ఎకరాల భూమిని రూ.40 వేలకు కౌలుకు తీసుకొని.. పత్తి పంట సాగు చేసిన. ట్రాక్టర్‌‌‌‌తో దుక్కి దున్నడానికి, విత్తనాలకు, కలుపు కూలీలు, పురుగు మందుల కోసం రూ.1.60 లక్షలు ఖర్చు చేసిన. పంట చేతికందే సమయంలో భారీ వర్షాల వల్ల పత్తి ఏరడానికి వీలైతలేదు. వానలకు కాసిన పత్తి జారి కిందపడిపోతున్నది. గులాబీ రంగు పురుగు ఆశించడంతో చెట్ల ఆకులు, పూత, కాయలు రాలిపోతున్నాయి. ఎకరానికి 3 క్వింటాళ్ల దిగుబడి వచ్చేలా లేదు. పత్తి పంటపైనే రూ.లక్షన్నర నష్టం వచ్చింది. ప్రభుత్వం పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి.-మోరె సాంబయ్య, కౌలు రైతు, శాయంపేట (హనుమకొండ) 

తడిసి ముద్దయితున్నది..

నేను ఐదున్నర ఎకరాల్లో పత్తి పంట  సాగు చేసిన. రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన. ఎకరానికి 4 క్వింటాళ్లకు మించి దిగుబడి కూడా అచ్చేటట్టు లేదు. ఒక్క పోస పత్తి అమ్మింది లేదు. వానలు ఇలానే కొడితే పత్తి చేనులోనే మొలకలెత్తి.. ఏరకుండానే వదిలేయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు రెండెకరాల వరకు పత్తి తీసినం. మిగతా మూడున్నర ఎకరాల్లో పత్తి తీసే క్రమంలోనే తుఫాన్‌‌ అందుకున్నది. మా రెక్కల కష్టం, లక్షల రూపాయల పెట్టుబడి వానపాలైంది. నమ్ముకున్న పంట పోయింది.. బతుకుడెట్లా అని రంది అయితున్నది.  -వెంపటి శంకర్, రైతు, గాంధీనగర్ (భూపాలపల్లి)

ఆరెకరాల్లో పత్తి ఆగమైంది!

తుఫాన్‌‌తో ఆరు ఎకరాల్లో పత్తి మొత్తం ఆగమైంది. ఈ సీజన్‌‌లో 9 ఎకరాల్లో పత్తి వేసిన‌‌. ఈ మధ్యనే మూడు ఎకరాల్లో పత్తి తీశా. మిగిలిన ఆరు ఎకరాల్లో పత్తి ఏరాలని అనుకునే లోపే వాన ఆగం చేసింది. రూ.3 లక్షలకు పైగా పంట నష్టం వాటిల్లింది.- కాకునూరి సైదిరెడ్డి, రైతు, మేళ్లచెరువు (సూర్యాపేట)