
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోవడంతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరుగాలం పండించిన పంట కల్లాల్లో తడిసిముద్దై పోవడంతో భారీ నష్టాల్ని మిగిల్చింది. చాలా చోట్ల ప్రభుత్వం వడ్ల కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతన్న ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచాల్సి వచ్చింది.నిన్న రాత్రి కురిసిన వర్షానికి తడిసిపోయింది. కొన్ని చోట్ల మామిడితోటలు,మిరపతోటలు ద్వంసమయ్యాయి.
- మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో నిన్న రాత్రి ఉరుములతో కూడిన వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి వర్షానికి తడిసిపోయింది. అకాల వర్షంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో జొన్న, వేరుశనగ పంటలు మునిగిపోయాయి.
- కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండల కేంద్రంలోని మైలారం గన్నేరువరం ధాన్యం కొనుగోలు సెంటర్ లో వర్షానికి ధాన్యం తడిసిపోయింది.జగిత్యాల జిల్లా
- ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లి,పెగడ పల్లి,బుగ్గారం,ధర్మారం మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. పలు చోట్ల ఈదురు గాలులకు మామిడి తొటలకు అపార నష్టం వాటిల్లింది.
- కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, సదాశివనగర్, భిక్కనూర్ మండలాల్లో సుమారు ఒక గంటపాటు ఉరుములు, మెరుపులు గాలితో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పంటలు నేలకొరిగాయి. మామిడికాయలు రాలిపోయాయి. రోడ్లపై ఆరబెట్టిన వరి, మక్క జొన్న కుప్పలు తడిసి ముద్దయ్యాయి. కొన్ని చోట్ల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.
- నల్లగొండ జిల్లా చిట్యాల వ్యవసాయ మార్కెట్, పిఏసీఎస్ సెంటర్స్ లో వర్షంలో వడ్లు కొట్టుకుపోయాయి. అధికారులు మిల్లర్లు కుమ్మక్కై మమ్మల్ని నిండా ముంచారని ఆరోపిస్తున్నారు రైతులు.
- పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలలో అర్థ రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. మంథని వ్యవసాయ మార్కెట్ యాడ్ తో పాటు పలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసిపోయింది. వరి ధాన్యం కుప్పల చుట్టూ నిలిచిన నీటిని తోడేస్తున్నారు రైతులు
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట, గీసుగొండ, దుగ్గొండి, నర్సంపేటలో మెక్కజొన్ననీట మునిగింది.
- మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వర్షానికి వడ్లు నానిపోయాయి.