ముంచెత్తిన వాన .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏరులను తలపించిన రోడ్లు

ముంచెత్తిన వాన .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏరులను తలపించిన రోడ్లు
  • ఉమ్మడి జిల్లాలో ఏరులను తలపించిన రోడ్లు.. లోతట్టు ప్రాంతాలు జలమయం  

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 53.7 మిల్లీమీటర్లు, కరీంనగర్ జిల్లాలో 49.5 మి.మీ, జగిత్యాల జిల్లాలో 34.5 మి.మీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 30.7 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్ సిటీలో రెండు గంటలపాటు వర్ష బీభత్సానికి జనజీవనం అతలాకుతలమైంది. సిటీలోని మెయిన్ రోడ్లతోపాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ ఆర్టీసీ వర్క్ షాప్, మంచిర్యాల చౌరస్తా, కిసాన్ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, ఏరోప్లేన్ బిల్డింగ్, జ్యోతి నగర్, శర్మనగర్, సాయినగర్ ఏరియాలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి సామగ్రి అంతా తడవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. కొన్ని అపార్ట్ మెంట్ సెల్లార్లు పూర్తిగా నీళ్లతో నిండిపోయి అందులోని వాహనాలు పూర్తిగా నీట మునిగాయి. కరీంనగర్– జగిత్యాల రోడ్డులోని ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద రోడ్డు పూర్తిగా నీటమునగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హుస్సేన్ పుర, కమాన్, సీతారాంపూర్ , బాలాజీనగర్, రాంనగర్ రోడ్డు, మంచిర్యాల చౌరస్తా, జ్యోతి నగర్, కలెక్టరేట్, బస్టాండ్ రహదారి, మంకమ్మతోట టూటౌన్ సమీపంలోని రోడ్లు, ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.  భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో కంట్రోల్ రూమ్‌‌‌‌‌‌‌‌లో 0878 2997247 టోల్ ఫ్రీ ఏర్పాటు చేసినట్లు  కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. 

రాజన్నసిరిసిల్ల జిల్లాలో.. 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఉదయం నుంచి వర్షం పడుతోంది. అత్యధికంగా ముస్తాబాద్ మండలంలో 75మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ముస్తాబాబ్ మండలంలోని రామలక్ష్మణపల్లె, పదిర గ్రామాల మధ్య మానేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆఫీసర్లు అక్కడి హెచ్చరిక బోర్డులు పెట్టి దారి మళ్లించారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కోనరావుపేట మండలంలోని మూలవాగు ప్రవహిస్తుండడంతో మండలంలోని మామిడిపల్లి మూల వాగు పై లో లెవెల్ బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో  మామిడిపల్లి నిజామాబాద్ గ్రామాలకు రవాణా స్తంభించిపోయింది. 

జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనూ.. 

పెద్దపల్లి/జగిత్యాల, వెలుగు: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. జిల్లాలో వర్షాలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అలాగే మరో రెండు రోజులు వర్షాలు ఉన్నాయనే వాతావరణశాఖ సూచనలతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో అత్యధికంగా 91 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సారంగాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 79.3 మిల్లీ మీటర్లు, ఎండపల్లి మండలం గుల్లకోటాలో 73.5 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.