మరో 4 రోజులు వానలు.. ఆ రెండు రోజులు భారీ వర్షాలు

మరో 4 రోజులు వానలు.. ఆ రెండు రోజులు భారీ వర్షాలు
  • 25, 26వ తేదీల్లో పలు జిల్లాలకు అతిభారీ వర్ష సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తొలి రెండు రోజులు మోస్తరు వర్షాలుంటాయని, ఆ తర్వాతి రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు మంగళ, బుధవారానికి (25, 26వ తేదీల్లో) ఆరెంజ్​ అలర్ట్ జారీ చేసింది. ఆ రెండు రోజుల్లో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం మరో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పింది.

వర్షాలు పడుతుండడంతో చలి తీవ్రత కూడా పెరిగింది. రాత్రిపూట టెంపరేచర్లు పడిపోతున్నాయి. మరోవైపు శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్, అదే జిల్లాలోని తాంసిలో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్​నగర్​ జిల్లా మహమ్మదాబాద్, ఖమ్మం జిల్లా రావినూతలలో 3.1, ఆదిలాబాద్​ జిల్లా తలమడుగులో 2.9, మేడ్చల్​ జిల్లా మచ్చబొల్లారంలో 2.8, భద్రాచలంలో 2.6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.