
ఏపీలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి..ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నెలకు ఒరిగాయి, పంటలు, రహదారులు దెబ్బతిన్నాయి. విజయనగరం జిల్లాలో బొబ్బిలి, భోగాపురం, మండలాల్లో అరటిపంట నేలమట్టం అయ్యింది. పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. ఇవాళ ( అక్టోబర్ 3 ) కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ
మన్నెం జిల్లాలోని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లోని గ్రామాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని నదుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్న క్రమంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించింది ప్రభుత్వం.భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించింది వాతవరణ శాఖ.