భారీ వర్షం.. గ్రేటర్ వరంగల్ జలమయం

భారీ వర్షం.. గ్రేటర్ వరంగల్ జలమయం

గ్రేటర్​ వరంగల్/ జయశంకర్ భూపాలపల్లి/నల్లబెల్లి, వెలుగు: గ్రేటర్​ వరంగల్​సిటీలో శనివారం కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ చౌరస్తా, హనుమకొండ చౌరస్తా, సుబేదారి, హనుమకొండ బస్టాండ్​, పోచమ్మ మైదాన్, కాశీబుగ్గ జంక్షన్, మార్కెట్ రోడ్డు, తిలక్​ రోడ్డు, కరీమాబాద్​, కాజీపేటల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నల్లబెల్లి మండలం కన్నారావుపేటలో పులిగుజ్జుల ముత్తయ్య అనే వృద్ధుడి ఇల్లు కూలిపోయింది.

గుండ్లహపాడ్​లో కల్లెపెల్లి పూలమ్మ ఇంటి గోడలు కూలాయి. బాధితుల ఇండ్లను తహసీల్దార్​కృష్ణ పరిశీలించారు.  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం సాయంత్రం వాన దంచి కొట్టింది. కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. మేడిగడ్డ బ్యారేజీకి  6,94,800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా అదే స్థాయిలో ఔట్ ఫ్లో కొనసాగుతోంది. తాడిచర్ల ఓసీ, కేటీకే –2,3 ఓసీల్లో వరద నీరు చేరడంతో నాలుగు రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిపివేశారు.