ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరదొస్తే రాకపోకలు బంద్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరదొస్తే రాకపోకలు బంద్
  •  మునుగుతున్న లోలెవెల్ కల్వర్టులు, కాజ్ వేలు
  •  ఏళ్ల కింద మొదలుపెట్టిన బ్రిడ్జిలు పూర్తికాక ఇబ్బందులు
  •  ప్రతీ వానాకాలంలో రాకపోకలకు అంతరాయం

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసి వాగుల్లో వరద పెరిగితే చాలా ప్రాంతాలకు రాకపోకలు బంద్ అవుతున్నాయి. ఎప్పుడో దశాబ్దాల క్రితం నిర్మించిన కల్వర్టులు, కాజ్ వేలు సగానికిపైగా శిథిలావస్థకు చేరడం, వరదలకు అవి తట్టుకునే పరిస్థితి లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు కొన్నిచోట్ల ప్రారంభించిన బ్రిడ్జిల నిర్మాణం పూర్తికాలేదు. దీంతో ప్రతి ఏటా వర్షాకాలంలో వరద వస్తే పలు గ్రామాల మధ్య రెండు, మూడు రోజులపాటు పూర్తిగా రాకపోకలు నిలిచిపోతున్నాయి. కల్వర్టులు, కాజ్ వేల స్థానంలో బ్రిడ్జిల నిర్మాణం చేస్తేనే సమస్యకు పరిష్కారం దొరికే అవకాశముంది. ముందుగా శిథిలావస్థలో గుంతలుపడి ఉన్న కాజ్ వేల స్థానంలోనైనా బ్రిడ్జిలు మంజూరు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.  

కరీంనగర్ జిల్లాలో..

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 80కిపై కాజ్‌‌‌‌‌‌‌‌వేలపై నుంచి ఏటా వరద నీరు ప్రవహిస్తోంది. వీటిలో సగానికిపైగా కాజ్ వేలు శిథిలావస్థకు చేరుకున్నట్లు గతంలోనే పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు గుర్తించారు. కానీ వాటి మరమ్మతులకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. చొప్పదండి మండలం ఆర్నకొండ, రాగంపేట గ్రామాల శివారులోని పంది వాగుపై  80వ దశకంలో నిర్మించిన లో లెవెల్ కాజ్ వే ఉండడంతో పంది వాగు పొంగినప్పుడల్లా ఆర్నకొండ నుంచి గోపాల్ రావుపేట మీదుగా మల్యాల, కొండగట్టు మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ఆయా గ్రామాల పరిధిలోని రైతులు, ప్రజలు ఎమ్మెల్యే, ఎంపీలను కోరుతున్నా పరిష్కారం కాలేదు. 
    
శంకరపట్నం మండలం అర్కండ్ల సమీపంలో చిన్నవర్షం పడినా కాజ్ వేపై నుంచి వరద పారుతుంది. దీంతో కన్నాపూర్ నుంచి వీణవంక మండలానికి వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే తరహాలో ఈ ఒక్క మండలంలోనే గద్దపాక-కాసాపూర్, చర్లపల్లి -కేశవపట్నం, గద్దపాక-అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు మరో ఆరు ఊళ్లకు ఇలాంటి సమస్యే ఎదురవుతోంది. 
    
గన్నేరువరం మండల కేంద్రంలోని పెద్దచెరువుతోపాటు గుండ్లపల్లి, జంగాపల్లి, పారువెల్ల మత్తడి వద్ద, లోలెవెల్ కల్వర్టు ప్రమాదకరంగా మారి ప్రతి వర్షాకాలంలో రోడ్లపై భారీగా నీరు ప్రవహిస్తోంది. గతంలో ఈ కల్వర్టుపై వాహనాలతోపాటు ప్రయాణికులు కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. గుండ్లపల్లి– పొత్తూరు డబుల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా బ్రిడ్జి నిర్మిస్తే సమస్య తీరనుంది. అయితే బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ పనులను నిలిపివేశాడు.  
    
మానకొండూరు మండలం అన్నారం సమీపంలో బ్రిడ్జి లేక వర్షాకాలంలో మానకొండూరు– జమ్మికుంట ప్రధాన రహదారికి రాకపోకలు నిలిచిపోతున్నాయి. దేవంపల్లి, పచ్చునూర్, కెల్లేడు, మద్దికుంట గ్రామాల వాసులు మండల కేంద్రానికి చేరుకోవాలంటే 8 కి.మీ తిరిగి రావాల్సి వస్తోంది. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి సమీపంలోని కాజ్ వే వరద ఉధృతికి కొట్టుకుపోయింది. 
    
జగిత్యాల-– ధర్మపురి రహదారిలోని జగిత్యాల రూరల్ మండలం అనంతారం శివారులోని వాగు వద్ద కల్వర్టుపై నుంచి వర్షాకాలంలో వరద పారుతుండటంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. 60 ఏళ్ల కింద అనంతారం వాగుపై కాజ్ వే నిర్మించారు. లో లెవల్ బ్రిడ్జి కావడంతో ఏటా వర్షాలకు మునిగిపోతోంది.  ధర్మపురి, బుగ్గారం, సారంగాపూర్ తదితర 50 గ్రామాలకు రాకపోకలు నిలిచి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.