కేరళలో కొనసాగుతున్న భారీ వర్షాలు

కేరళలో కొనసాగుతున్న భారీ వర్షాలు
  • మరో ఐదు రోజుల పాటు వానలు పడే చాన్స్
  • ఓ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

తిరువనంతపురం : కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా ఈదురుగాలులతో కూడిన వాన పడుతుండటంతో  జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలతోపాటు బలమైన గాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (కేఎస్‌‌‌‌డీఎంఏ) సూచించింది. రాష్ట్రంలో మరో ఐదురోజులు భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) బుధవారం వెల్లడించింది. ఓ జిల్లాకు రెడ్ అలర్ట్.. 8 జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన వాటికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నెల 21 వరకు మత్స్యకారులెవరూ కేరళ, కర్నాటక, లక్షద్వీప్ తీర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లవద్దని కోరింది. 

వయనాడ్‌‌‌‌కు రెడ్ అలర్ట్

కేరళలోని వయనాడ్‌‌‌‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ జిల్లాకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే.. పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్‌‌‌‌గోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇక రాష్ట్రంలోని మిగిలిన ఐదు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్  అనేది 24 గంటల్లో 20 సెం.మీ. కంటే ఎక్కువగా కురిసే అతి భారీ వర్షాన్ని సూచిస్తుంది. ఆరెంజ్ అనేది 6 సెం.మీ. నుంచి20 సెం.మీ. వరకు వర్షాన్ని,  ఎల్లో అనేది6 నుంచి 11 సెం.మీ. మధ్య వర్షపాతాన్ని సూచిస్తుంది. 

ప్రమాదకర స్థాయికి చేరిన నదులు

కేరళలో కురుస్తున్న వర్షాలపై  కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) స్పందించింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయని చెప్పింది. ఆస్తి నష్టం సంభవించడం, రోడ్లు జలమయమవడంతోపాటు వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయని వివరించింది. పతనంతిట్టలోని అచ్చన్‌‌‌‌కోవిల్‌‌‌‌, ఇడుక్కిలోని తొడుపుజా  సహా వివిధ నదుల నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి పెరిగాయని హెచ్చరికలు జారీ చేసింది.