మహారాష్ట్రలో భారీ వర్షాలు..సీఎం ఇంటి చుట్టూ చేరిన నీరు

మహారాష్ట్రలో భారీ వర్షాలు..సీఎం ఇంటి చుట్టూ చేరిన నీరు

మహారాష్ట్రలో గత నాలుగురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాల్ఘర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో కొట్టుకపోయారు. వర్షాల దాటికి 32 ఇళ్లు కూలిపోగా.. ఒక్కరు గాయపడ్డారు. NDRF దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ముంబైలో భారీ వర్షాలకు సెంట్రల్ రైల్వే మార్గంలో ట్రాక్ పై గోడ కూలడంతో..లోకల్ ట్రైన్ సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. థానేలో కురిసిన భారీ వర్షాలకు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఇంటి చుట్టూ నీరు చేరింది. వెంటనే సీఎం ఇంటి చుట్టూ నిలిచిన నీటిని అధికారులు తొలగించారు.

పశ్చిమ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై సహా రత్నగిరి, రాయ్ గఢ్, పుణె, సతారా, కొల్హాపూర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కొల్హాపూర్ జిల్లాలో పంచగంగ నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. రానున్న మూడ్రోజులు కొల్హాపూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలకు నదుల నీటి మట్టం పెరిగింది. పంచగంగతో పాటు దూద్ గంగా, హిరణ్య కేషి, ఘటప్రభ నదుల్లో ప్రవాహ తీవ్రత పెరిగింది. వాడాలో గరిష్ఠంగా 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

రెడ్, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో ప్రజలు బీచ్ లకు వెళ్లడాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిషేధించింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో వరుసగా 10.9, 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిప్లూన్ సమీపంలో పరశురామ్ ఘాట్ సెక్షన్ లో కొండచరియలు విరిగిపడటంతో ముంబై-గోవా హైవే పై ట్రాఫిక్ ను మళ్లించారు. శిథిలాల తొలగింపు పనులు జరుగుతున్నందున.. మరో రెండ్రోజుల పాటు ఈ దారిలో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.