తౌక్టే ఎఫెక్ట్.. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు

తౌక్టే ఎఫెక్ట్.. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు

తౌక్టే తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం గ్రేటర్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. సైదాబాద్, రాజేంద్ర నగర్, అత్తాపూర్, బండ్లగూడ, కిస్మత్ పుర్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, వనస్థలిపురం, యూసుఫ్ గూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో దాదాపు అరగంట పాటు వర్షం దంచికొట్టింది. 

బహదూర్ పురా, అత్తాపూర్‌లో 1.8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. శివరాంపల్లి, అసిఫ్ నగర్, మైలార్ దేవుపల్లిలో 1.6 సెంటీ మీటర్లు, ఫలకనుమలో 1.5 సెంటీ మీటర్లు, కార్వాన్, చాంద్రాయణగుట్ట, చార్మినార్ లో 1.4 సెంటీ మీటర్లు, జియగూడాలో 1.2, సరూర్ నగర్‌లో 1.1, నాగోల్, LB నగర్, బార్కస్‌లో 1 సెంటీ మీటర్ వర్షపాతం రికార్డయ్యింది. 

జిల్లాల్లో కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. రానున్న 3 గంటల్లో నాగర్ కర్నూల్,  జోగులంబ గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, వికారాబాద్, రంగారెడ్డి  జిల్లాల్లో ఉరుములు మెరుపులతో.. తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు.. కొన్ని చోట్ల 40 కిలో మీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది.

వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లాక్ డౌన్ వేళ నిత్యవసరాల కోసం బటయకు వచ్చిన జనం వర్షంతో ఇబ్బంది పడ్డారు. చాలా ఏరియాల్లో కొద్ది సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.