కుండపోత వాన

కుండపోత వాన
  • కుండపోత వాన
  • అత్యధికంగా నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో 16.2 సె.మీ, కామారెడ్డి జిల్లా పిట్లంలో 17.5 సెం.మీ వర్షపాతం నమోదు 
  • నిండిన చెరువులు, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు
  • ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాల్లో హై అలర్ట్​ 
  • ధ్వంసమైన రోడ్లు, కూలిన పురాతన ఇండ్లు 
  • నిలిచిన రాకపోకలు, నీట మునిగిన పంటలు

 నిజామాబాద్,కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఆదివారం అర్ధ రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కుండపోత వాన కురిసింది. పలు మండలాల్లో వాగులు పొంగి ప్రవహించటంతో రోడ్లు తెగి రాకపోకలు బంద్ అయ్యాయి.  అత్యధికంగా నిజామాబాద్​ జిల్లా రుద్రూర్ మండలంలో 16.2 సె.మీ, కామారెడ్డి జిల్లా పిట్లంలో 17.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్​ జిల్లాలో ఆరు పాత ఇండ్లు కూలిపోగా, మరో ఏడు ఇండ్లలోని 60 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. కోటగిరి మండలంలో ఆరు ఇండ్లు దెబ్బతినగా కుటుంబీకులకు షెల్టర్ ఏర్పాటు చేశారు.

వర్ని మండలంలో పది ఇండ్లు కూలిపోగా బాధితులకు పునరావాసం కల్పించారు. వర్ని మండలం జలాల్​పూర్​లో చెరువు అలుగు పారడంతో బ్యారికేడ్లు పెట్టి పోలీసులు రోడ్డు  క్లోజ్ చేశారు. బడాపహాడ్ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రూర్​ మండలంలో గుండ్ల చెరువు నిండి అలుగు పారడంతో అటుగా వెళ్లే రోడ్డును మూసేశారు.   ఎస్సారెస్పీకి భారీగా వరద నీరు వస్తోంది. పరీవాహక గ్రామాల ప్రజలను అలర్ట్​ చేశారు.  పోతంగల్​ మండలం సుంకిని వద్ద మంజీరా ఉధృతంగా ప్రవహిస్తోంది. బోధన్​ మండలంలోని భిక్నెల్లి, హంగర్గా  గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. నాగన్​పల్లి, లంగ్డాపూర్​ వాగులు నిండుగా పారుతున్నాయి. అలీసాగర్​ రిజర్వాయిర్​కు వరద కొనసాగుతోంది.      

కామారెడ్డి జిల్లాలో.. 

కామారెడ్డి జిల్లా సర్వాపూర్ శివారు గాంధారి, బాన్సువాడ మధ్య రాకపోలకు అంతరాయం కలిగింది. పిట్లం మండలంలోని కాకివాగు పొంగి పొర్లింది. దీంతో పిట్లంతో పాటు సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి.  ఎల్లారెడ్డి మండలంలోని కల్యాణి ప్రాజెక్టు నీటి ప్రవాహంతో తిమ్మారెడ్డికి రాకపోకలు నిలిచాయి.  పెద్దకొడప్​గల్ మండలం విఠల్ వాడి తండా,  లింగంపల్లి మధ్య రోడ్డు, మహమ్మద్​నగర్ మండలం తునికిపల్లి రోడ్డుపై  వరద ప్రవాహంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ట్రాక్టర్​పై రోడ్డు దాటాల్సి వచ్చింది. తునిపల్లిలో ఇండ్లలోకి వరద నీరు చేరింది.  నిజాంసాగర్​ మండలంలోని అచ్చంపేట రోడ్డుపై నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో భారీ కేడ్లు ఏర్పాటు చేశారు.  మహమ్మద్​నగర్​ మండలం  గాలిపూర్​ బ్రహ్మణ్​ చెరువుకు బుంగ పడటంతో నీరు వృథాగా పంట పొలాల్లోకి చేరింది. ఆయా ఏరియాల్లో  కొన్ని చోట్ల  పొలాలు, పత్తి పంట నీట మునిగింది. సింగీతం రిజర్వాయర్​ కు బుంగ ఏర్పడటంతో ఇసుక సంచులు అడ్డుగా వేశారు.  భారీ వర్షాల దృష్ట్యా కామారెడ్డి కలెక్టరేట్​లో టోల్​ ఫ్రీ నంబర్ 08468-220069 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్​ పేర్కొన్నారు.