
- అలుగుపోస్తున్న చెరువులు
- ప్రాజెక్టుల గేట్లు ఓపెన్
వెలుగు, నెట్వర్క్:భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులుఉమ్మడి పాలమూరు జిల్లాలో గురువారం అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వర్షాలతో ప్రజలు బయటకు రావడం లేదు. చెరువులు అలుగుపోస్తుండగా, పలు చోట్ల పంట పొలాల్లోకి వరద నీరు చేరి నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లల్లోకి వరద నీరు చేరడంతో అక్కడి ప్రజలను పోలీస్, రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. పాత ఇండ్లల్లో ఉండవద్దని సూచించారు.
ఉమ్మడి జిల్లా కలెక్టర్లు భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా, మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీలు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ విపత్కర పరిస్థితులు ఎదురైతే సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలం మణికొండ ఊరచెరువు అలుగుపోయడంతో 30 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. మరికల్ మండలం తీలేరులో వరి పొలాల్లోని వరద నీరు చేరింది. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌లో పత్తి చేలు దెబ్బతిన్నాయి. మద్దూరు మండలం లింగాల్చెడ్ చెక్ డ్యామ్, మద్దూరు పెద్దవాగు, పాలమూరులోని కొత్త చెరువులు అలుగుపోస్తున్నాయి.
భారీ వరదలతో కోయిల్‌సాగర్ 7 గేట్లను ఎత్తి 14,700 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సంగంబండ రిజర్వాయర్ రెండు గేట్ల ఎత్తి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో రివ్యూ చేశారు. ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు.మహబూబ్‌నగర్ పాత కలెక్టరేట్ లోని కన్జ్యూమర్ కోర్టులో వరద నీరు చేరింది. ఆఫీస్ సిబ్బంది ఫైల్స్ ను టేబుళ్లపై పెట్టుకుని పని చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బోయలగూడెం, లింగాపురం గ్రామాల మధ్య వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అయిజ నుంచి ఎమ్మిగనూరు కి వెళ్లే రోడ్డుపై ఉన్న పోలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు కోరారు.
వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళాసాగర్ ప్రాజెక్టులోని ఆటోమేటిక్ సైఫన్లలో ఒక వుడ్, రెండు ప్రైమరీ సైఫన్లు తెరుచుకుని 4 వేల క్యూసెక్కుల వరద నీరు కిందికి పోతోంది. కొత్తకోట మండలం శంకరసముద్రం రిజర్వాయరు నుంచి వరద నీరు రామన్‌పాడు ప్రాజెక్టులోకి వెళ్తోంది. దీంతో ఒక గేటును ఎత్తి నీటికి కిందికి వదులుతున్నారు. సరళసాగర్ ప్రాజెక్టు నీటి విడుదలతో మదనాపురం,- ఆత్మకూరు మధ్య ఉన్న లోలెవల్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు.