జోరువాన.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత

జోరువాన.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత
  •    కొనుగోలు సెంటర్లలో తడిసిన వడ్లు
  •     పిడుగులు పడి, చెట్టు విరిగి, గోడ కూలి.. ఆరుగురు మృతి
  •     హైదరాబాద్​లోనూ భారీ వర్షం
  •     ట్రాఫిక్ జామ్​లతో జనం అవస్థలు
  •     ఈదురుగాలులకు కూలిన చెట్లు, కరెంట్ స్తంభాలు 
  •     మరో ఐదు రోజులు వర్షాలు 

నెట్​వర్క్/హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. వివిధ జిల్లాల్లో మంగళవారం కుండపోత వానలు కురవగా.. కొన్ని చోట్ల వడగండ్లు పడ్డాయి. భారీ వర్షాలకు కొనుగోలు సెంట్లర్ల దగ్గర వడ్ల కుప్పలు తడిసిపోయాయి. కోతలు పూర్తయి ఆరబోసుకున్న వడ్లు వాననీళ్లలో కొట్టుకుపోయాయి. అనేక చోట్ల చెట్లు, పోల్స్ విరిగిపడడంతో కరెంట్ సప్లై నిలిచిపోయింది. వర్షం ధాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో పిడుగు పడి ఇద్దరు, వరంగల్ జిల్లాలో చెట్టు విరిగిపడి మరొకరు చనిపోగా.. గోడకూలి మెదక్​ జిల్లాలో ఇద్దరు,  బాచుపల్లి​లో ఒకరు చనిపోయారు. హైదరాబాద్ సిటీలోనూ అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో  వర్షం దంచికొట్టింది. రోడ్లపై నీరు నిలిచిపోయి, ట్రాఫిక్ జామ్​లతో జనం అవస్థలు పడ్డారు. మరోవైపు ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు వర్షంతో కాస్త ఊరట లభించినట్లయింది. పలు చోట్ల మధ్యాహ్నం మబ్బులు కమ్ముకోవడంతో పట్టపగలే చీకట్లు అలుముకున్నాయి. 

ఆరుగురు మృతి 

గాలివాన ధాటికి వివిధ జిల్లాల్లో ఆరుగురు మృతిచెందారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాల వద్ద పెద్ద చెట్టు కూలి ఇల్లంద గ్రామానికి చెందిన ఆబర్ల దయాకర్(22) చనిపోయాడు. పశువులకు గడ్డి తేవడానికి ట్రాక్టర్​పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం ఎర్రారం గ్రామానికి చెందిన రైతు బోయిని పాపయ్య(50) పశువులు మేపడానికి వెళ్లి వస్తుండగా పిడుగు పడి చనిపోయారు. సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లిలో పిడుగుపాటుకు గురై కుమ్మరి మల్లేశం(30) అనే యువకుడు మృతి చెందాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయలపూర్ శివారులో ఫామ్ హౌస్ లో కోళ్ల ఫారం కోసం కడుతున్న గోడ భారీ వర్షానికి కూలిపోయింది. అక్కడ పని చేస్తున్న ఏపీకి చెందిన మేస్త్రీలు చింతపండు సుబ్రహ్మణ్యం(45), మాదాస్ నాగు(35)పై గోడ కూలగా, వారు అక్కడికక్కడే చనిపోయారు. హైదరాబాద్​శివారు బాచుపల్లి రేణుక ఎల్లమ్మకాలనీలో వర్షం వల్ల ఓ భవనం సెల్లార్ గోడ కూలిపోయి, పక్కనే ఉన్న కూలీల గుడిసెలపై పడింది. దీంతో ఒకరు చనిపోయారు. 

తడిసిన ధాన్యం.. రాలిన మామిడి  

కరీంనగర్ జిల్లావ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం గంటన్నర పాటు ఈదురుగాలులతో పాటు కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని చీకట్లు అలుముకున్నాయి. గన్నేరువరం, చొప్పదండి, జమ్మికుంట, శంకరపట్నం, మానకొండూరు మార్కెట్ యార్డులు, ఐకేపీ సెంటర్లకు రైతులు తెచ్చిన, ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. తూకం వేసి లోడ్ చేసేందుకు రెడీగా ఉన్న బస్తాలు కూడా తడిచిపోయాయి. చిగురుమామిడి మండలం సీతారాంపూర్ లో గాలివాన బీభత్సానికి విద్యుత్ స్తంభం, చెట్టు నేలకొరిగాయి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి, వెల్గటూర్, మల్యాల మండలాల్లో, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొల్లారం, హనుమాజీపేట, లింగంపల్లి ఎదురుగట్ల తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. నాగారంలో వడగండ్లు పడగా మామిడికాయలు నేలరాలాయి. హనుమకొండ జిల్లాలో ధర్మసాగర్, కమలాపూర్, ఐనవోలు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు, మహబూబాబాద్, జనగామ జిల్లాలోని జనగామ, బచ్చన్నపేట, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో సెంటర్లలోని వడ్లు తడిశాయి. జనగామ జిల్లాలో146 విద్యుత్ స్తంభాలు, 8 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి.  

ఎగిరిపోయిన ఇండ్ల పైకప్పులు 

మెదక్ మార్కెట్ యార్డులో ఇద్దరు రైతుల వడ్లు తడిసిపోయాయి. తూప్రాన్, నర్సాపూర్, నిజాంపేట్ లో కూడా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్ మండలాల్లో ఈదురుగాలులతో వడగండ్ల వాన పడింది. దహెగాం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిసిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, బజార్ హత్నూర్, ఆదిలాబాద్, బోథ్ పట్టణాల్లో ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి, కోహెడ, చేర్యాల, మద్దూరు, కుకునూరుపల్లి, దుబ్బాక మండలాల్లో భారీ వర్షం కురిసింది. చేర్యాల, మద్దూరు మండలాల్లో భారీ గాలులకు పలు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. యాదగిరిగుట్టలో ఈదురుగాలులకు చలువ పందిళ్ళు, రేకుల షెడ్లు ఎగిరిపోయాయి.

విరిగిన చెట్లు.. కరెంట్ పోల్స్   

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలివానతో కరెంట్ స్తంభాలు విరిగాయి. చెట్ల కొమ్మలు పడి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. కొత్తగూడెం టౌన్​లోని కొన్ని ఏరియాల్లో నాలుగు గంటలకు పైగా పవర్ సప్లై నిలిచిపోయింది. అశ్వారావుపేట మండలంలో గాలివానతో అరటి తోటలు నేలకొరిగాయి. యాదాద్రి జిల్లా ఆలేరు తదితర ప్రాంతాల్లో వడగండ్లు పడి.. కోత దశలో ఉన్న వరి చేన్లు దెబ్బ తిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలు తడిచిపోయాయి. కాంటా వేసినా లారీలు రాక నిల్వ ఉన్న వడ్ల బస్తాలు తడిశాయి. ఖమ్మం జిల్లాలో 4గంటలపాటు కరెంటు నిలిచిపోయింది. నల్గొండ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సరిగా లేకపోవడంతో వరద నీరంతా రోడ్లపైనే ప్రవహించింది. దీంతో పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపేశారు.   

విద్యుత్ సిబ్బంది అలర్ట్ 

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి విద్యుత్ లైన్లు తెగిపడడంతో కరెంటు సరఫరాపై ఎఫెక్ట్ పడింది. అనేక చోట్ల చీకట్లు అలముకున్నాయి. దీంతో విద్యుత్ సిబ్బంది రంగంలోకి దిగి కరెంటు పునరుద్ధరణ పనులు చేపట్టారు.  రెండు డిస్కంల పరిధిలోని పలు సర్కిళ్ళ సూపరింటెండింగ్ ఇంజనీర్లకు సీఎండీలు పలు సూచనలు చేశారు. ప్రతి సర్కిల్ పరిధిలో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ లైన్ల పునరుద్ధరణ కోసం సిబ్బందిని, మెటిరియల్​ను యుద్ధ ప్రాతిపదికన అందుబాటులో ఉంచాలని చెప్పారు. అంతరా యాలు లేకుండా కరెంట్ సరఫరా చేయాలన్నారు. అంతరాయాలున్న ప్రాంతాల్లో వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. సమస్యలపై 1800 425 0028కు లేదా1912 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలకు అధికారులు సూచించారు.

ఇంకో ఐదు రోజులు వానలు

రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. రాష్ట్రంలో టెంపరేచర్లు చాలా వరకు దిగొచ్చాయి. అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలలోపే నమోదయ్యాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద, నిజామాబాద్​లో 44.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్​లో 44.3 డిగ్రీల టెంపరేచర్​ రికార్డ్​ అయింది. మిగతా జిల్లాల్లో 43 డిగ్రీలకన్నా తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో 39 డిగ్రీల టెంపరేచరే రికార్డ్​ అయింది.

సిటీలో దంచికొట్టిన వాన

హైదరాబాద్ సిటీలోనూ మంగళవారం భారీ వర్షం కురిసింది. వర్షానికి ఎండలు, ఉక్కపోత నుంచి సిటీ ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. అయితే, సాయంత్రం సమయంలో వర్షం పడటంతో ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లేవారు ఇబ్బందులుపడ్డారు. అత్యధికంగా మియాపూర్ లో 10.8, కూకట్ పల్లిలో 10.7 సె.మీ వర్షపాతం నమోదైంది. కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, చందానగర్, ఉప్పల్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్​రోడ్స్, అంబర్​పేట్, బషీర్​బాగ్, అబిడ్స్, నారాయణ గూడ, కోఠీ, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, వనస్థలిపురం, శేరిలింగంపల్లి, మీర్​పేట్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాంలు అయ్యాయి. ఎల్బీ నగర్ నుంచి మన్సురాబాద్ వెళ్లే రోడ్డులో భారీ చెట్లు కూలడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఐటీ కారిడార్ లో వడగండ్ల వర్షం కురిసింది. బయో డైవర్సిటీ జంక్షన్ నుంచి ఐకియా, సైబర్ టవర్స్ మీదుగా జేన్టీయూ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఫిలీంనగర్, జుబ్లీహిల్స్ తదితర చోట్ల కూడా ట్రాఫిక్​ నిలిపోయింది. దాదాపు 3 గంటల పాటు కురిసిన వర్షానికి పలు కాలనీలు నీటమునిగాయి. రోడ్లు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా, సిటీలో బుధవారం కూడా ఈదురుగాలులు వీస్తాయని, గురువారం భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.