ముసురుకున్న తెలంగాణ.. భారీ వర్షాలు.. సికింద్రాబాద్ లో ట్రాఫిక్​ జామ్​

ముసురుకున్న తెలంగాణ.. భారీ వర్షాలు.. సికింద్రాబాద్ లో ట్రాఫిక్​ జామ్​

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జల కళను సంతరించుకుంటున్నాయి. దీంతో బీడు వారిన రైతన్నల ఆశలు చిగురిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ ఖమ్మం , మహబూబాబాద్, వరంగల్,  హనుమకొండ, జనగాం అయిదు జిల్లాలకు రెడ్ అలర్ట్​ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలు, ప్రాజెక్టుల దిగువ ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

జులై 18న ఒక్క రోజే పలు జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షాలు నమోదయ్యాయి. తాజా పరిణామాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సీఎస్​ శాంతకుమారి ప్రగతి భవన్లో ఆయా జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. కలెక్టరేట్లు, మండల కేంద్రాల్లో వరద సహాయ ప్రాంతాలకు సంబంధించి కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

హైదరాబాద్ లో ఇదీ పరిస్థితి..

హైదరాబాద్​లో జులై 19 ఉదయం నుంచే ముసురు వర్షాలు జోరందుకున్నాయి. జులై 18 అర్ధరాత్రి అమీర్​పేట, ఎస్​ ఆర్​నగర్​, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో కరెంట్​కట్​ అయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్, బంజారా హిల్స్,జూబ్లీహిల్స్,హైటెక్ సిటీ, గచ్చి బౌలీ, పంజాగుట్ట,బేగంపేట్, సికింద్రాబాద్, మలక్ పేట్, లక్డీకాపూల్, మెహాదీపట్నం, టోలి చౌకీ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

శేరిలింగంపల్లి లో అత్యధికంగా 4.5 సెంటీ మీటర్లు, కనిష్టంగా రాజేంద్ర నగర్ లో 0.6 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. దీంతో భాగ్యనగరానికి వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్​ జారీ చేశారు.  అయిదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో మేయర్​ గద్వాల విజయలక్ష్మీ అధికారులను అప్రమత్తం చేవారు.  కంటోన్మెంట్ లో కురుస్తున్న ముసురు వానకు సంగీత్ చౌరస్తా నుంచి ప్యారడేస్..బేగంపేట రూట్ లో ట్రాఫిక్ జామ్స్ తో వాహనాలు స్లోగా కదులుతున్నాయి.