- ఉధృతంగా ప్రవహిస్తున్న ఆకేరు, పాలేరు, మున్నేరు వాగులు
- వర్షంతో రైతుల్లో ఆనందం
మహబూబాబాద్, వెలుగు: మానుకోట జిల్లాలో బుధవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు సంతోషంను వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా వానల జాడ లేకపోవడంతో చెరువుల్లో వినాయక నిమజ్జనం చేస్తే విగ్రహాలు మునిగే పరిస్థితి లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో ఆనందం నెలకొన్నది. జిల్లాలోని పెద్దవంగర, ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం, దంతాలపల్లి మండలం నిదానపురం, తొర్రూరు మండలం అమ్మాపురం చెరువులు మత్తడి పోస్తున్నాయి. మిగిలిన చోట్ల చెరువుల్లోకి వర్షపు నీరు చేరుతోంది. గురువారం మహబూబాబాద్ జిల్లాలో నెల్లికుదురు 123.6 మి.మీ, మరిపెడ 122.6 మి.మీ, పెద్దవంగర మండలంలో 118.6 మి.మీ, తొర్రూరు మండలంలో 104.6 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. గార్లలో విద్యుత్ స్తంభం నేలకూలింది. పెద్దవంగర మండలం వడ్డేకొత్తపల్లిలోని ఆయుష్ వైద్యశాలలోకి చేరిన నీరు చేరడంతో కొన్ని మందులు తడిసిపోయాయి.
వాగులకు జలకళ..
భారీ వర్షాలతో జిల్లాలోని ప్రధాన వాగులు ఆకేరు, పాలేరు, మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లు నిండిపోవడంతో మత్తడి పోస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో జలకళ సంతరించుకుంది.
ఆఫీసర్లు అలర్ట్‌గా ఉండాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు కొనసాగించినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, వంతెనలు, చెరువులు, జలాశయాలు, రహదారులు, పాత భవనాలు, ఇతర సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట హెచ్చరిక సూచికలను ఏర్పాటు చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, విహారయాత్రలకు వెళ్లడం, జలాశయాలు, చెరువుల వద్దకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లడం వంటివి చేయవద్దని కలెక్టర్ సూచించారు. వర్షాలు, వరదల కారణంగా అత్యవసర సహాయం కోసం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉంటారని, అత్యవసర పరిస్థితుల్లో 79950 74803 కు సమాచారం అందించాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో పాటు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
