గులాబ్ ఎఫెక్ట్...హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన

గులాబ్ ఎఫెక్ట్...హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన
  • పొంగిన నాలాలు, మ్యాన్​హోల్​లు.. నీట మునిగిన కాలనీలు
  • ఎక్కడికక్కడ ట్రాఫిక్​ జామ్​లు.. తిప్పలు పడ్డ జనం
  • ఊర్లల్లో కొట్టుకుపోయిన రోడ్లు
  • నిండు కుండలా హుస్సేన్ సాగర్
  • మణికొండలో మ్యాన్​హోల్​లో ​పడ్డ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి శవమై తేలిండు

హైదరాబాద్​ను వాన ముంచెత్తింది. సోమవారం మబ్బుల నుంచి రాత్రి వరకు రికాం లేకుండా కురిసింది.  జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని వాళ్లు బిక్కుబిక్కుమంటు గడిపారు. వానకు తోడు వరద పోటెత్తింది. గల్లీల్లోకి మోకాళ్లలోతు నీళ్లు చేరడంతో బయటకు వచ్చే దారి లేక జనం తిప్పలు పడ్డారు. మెయిన్​ రోడ్లు కూడా చెరువులను తలపించాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్​ జామ్​లు ఏర్పడ్డాయి. గులాబ్​ తుఫాను​ ఎఫెక్ట్​ వల్ల హైదరాబాద్​తోపాటు దాదాపు రాష్ట్రమంతా వర్షాలు కురిశాయి. ఖమ్మం, కొత్తగూడెం, ఆదిలాబాద్​, మహబూబాబాద్​, వనపర్తి, వరంగల్​, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. పొట్టకొచ్చిన వరి పొలాలు నీటమునిగాయి. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌/ నెట్​వర్క్​, వెలుగు: గులాబ్  తుఫాను ప్రభావంతో సోమవారం హైదరాబాద్​ను వాన ముంచెత్తింది. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు నాన్‌‌‌‌‌‌‌‌స్టాప్‌‌‌‌‌‌‌‌గా కురిసింది. ఒకటి రెండు జిల్లాల్లో తప్ప రాష్ట్రమంతా భారీగా వర్షాలు పడ్డాయి. అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు, కాలనీలు చెరువులను తలపించాయి. కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. చెట్లు, కరెంట్‌‌‌‌‌‌‌‌ స్తంభాలు నేలకొరిగాయి. నిర్మల్‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌‌‌‌‌‌‌‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ప్రజలు, ప్రభుత్వం అలర్ట్‌‌‌‌గాఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అవసరమైతే తప్ప జనం బయటకు రావద్దని సూచించింది.  దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను దారి మళ్లించింది. మరికొన్నింటిని రద్దు చేసింది. కొన్ని రూట్లలో రీషెడ్యూల్‌‌‌‌‌‌‌‌ చేసింది. 

హైదరాబాద్​లో దంచికొట్టిన వాన

హైదరాబాద్​లో 150 కాలనీలు, బస్తీల్లోకి భారీగా వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్​, ఖైరతాబాద్​, బోడుప్పల్​, నాగోల్​లోని పలు కాలనీల్లో వందకుపైగా ఇండ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.  మెయిన్​ రోడ్లు కూడా చెరువులను తలపించాయి. హైటెక్​ సిటీ, సికింద్రాబాద్​, మాదాపూర్​, బంజారాహిల్స్​, టోలిచౌకి, అత్తాపూర్ లాంటి ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. మరో రెండు రోజులు అలర్ట్​గా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. జీహెచ్ఎంసీ హెడ్​ ఆఫీసు, హైదరాబాద్​ కలెక్టరేట్​లో కంట్రోల్​ రూమ్‌‌లు  ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని వాళ్లు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని జీహెచ్​ఎంసీ మేయర్ గద్వాల్​ విజయలక్ష్మి కోరారు. సోమవారం రాత్రి వరకు గ్రేటర్‌‌లో అత్యధికంగా రాజేంద్రనగర్‌‌లో 11.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శివరాంపల్లిలో 9.7, మలక్‌‌పేట్‌‌లో 8.8, కాప్రాలో 7.5, సెంట్రల్ వర్సిటీ, మాదాపూర్, చందానగర్, జూబ్లీహిల్స్, అల్వాల్, బేగంపేట్‌‌లో 6 నుంచి 7 సెం. మీటర్ల వర్షపాతం నమోదైంది.

లోతట్టు ప్రాంతాలకు వరద ముంపు

రికాం లేని వానల వల్ల గ్రేటర్​ హైదరాబాద్​లోని లోతట్టు ప్రాంతాలకు వరద ముంపు పొంచి ఉంది. మూసీ, హుస్సేన్​సాగర్​ పరివాహాక ప్రాంతాల్లోని జనం భయాందోళనకు గురవుతున్నారు. సరూర్ నగర్‌‌లోని కోదండరాం నగర్, సీసాల బస్తీ, భాగ్యనగర్ కాలనీల్లోకి వరద చేరింది. వరద ముంపు పొంచి ఉన్న నాగోల్ అయ్యప్ప నగర్​ నుంచి  కొంత మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. హైటెక్ సిటీలో రోడ్లపై రెండు అడుగుల ఎత్తున వరద చేరడంతో.. భారీగా ట్రాఫిక్​ జామ్​ అయింది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, తార్నాక, పద్మారావునగర్​, దిల్​సుఖ్​నగర్​ లోని పలు కాలనీలు నీట మునిగాయి. సిటీ చుట్టూ  ఉన్న దాదాపు 30 చెరువులు, మూడు జలాశయాలకు భారీగా వరద చేరుతున్నది. ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ జలాశయాల గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. హుస్సేన్ సాగర్‌‌లో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి వరద నీటిని కిందికి వదలడంతో లోతట్టు ప్రాంతాలైన గాంధీనగర్, లోయర్ ట్యాంక్ బండ్​, ఎంఎస్ మక్తా, ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్, బల్కాపూర్ నాలాలకు వరద ముంపు పొంచి ఉంది. అప్పా చెరువు, కాముని చెరువుల్లోకి భారీగా నీరు చేరడంతో దిగువ ప్రాంతాల్లోని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. 

జిల్లాల్లోనూ..

పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచే మొదలైన వర్షం సోమవారం కూడా కంటిన్యూ అయింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 

  • మెదక్ జిల్లాలోని తూప్రాన్​ మండలం ఇస్లాంపూర్​లో  9 సె.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మనోహరాబాద్ అండర్ పాస్​లోకి వరద చేరడంతో హైదరాబాద్​– నాగ్​పూర్​ నేషనల్​ హైవేపై వెహికల్స్​ను దండుపల్లి మీదుగా పంపుతున్నారు. 
  • వరంగల్‍ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్​లో డీఫ్లోరైడ్ ప్రాజెక్టులోకి వరద చేరడంతో ప్రమాదం నివారించేందుకు నీటిని బయటకు పంపిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అన్నారం బ్యారేజీ వద్ద 59 గేట్లు, మేడిగడ్డ బ్యారేజీ వద్ద 70 గేట్లు ఎత్తి ఫ్రీ ఫ్లో తో వాటర్ భద్రాచలం వైపు వదులుతున్నారు. ములుగు జిల్లాలోని రామప్ప సరస్సు బ్యాక్ వాటర్​తో పంట పొలాలు మునిగాయి. 
  • సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం దొండపాడులో  7.9 సె.మీటర్ల వర్షపాతం నమో దైంది. మునగాల మండలంలో గణపవరం వెళ్లే దారిలో కల్వర్టుకు గండి పడడంతో వందలాది ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. మూసీ ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 
  • ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని ఇందిరమ్మ, అంబేద్కర్ కాలనీల్లో ఇండ్లలోకి నీరు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి వద్ద పెద్దవాగు ఉధృతికి రోడ్డు కోతకు గురైంది. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కిన్నెరసాని వరద ఉధృతితో 4 ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి.  
  • కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కుర్తి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నిజాంసాగర్  ప్రాజెక్టు నిండడంతో ఏడు గేట్లు ఎత్తారు. దీంతో మంజీరా నది  పొంగి ప్రవహిస్తుండడంతో గ్రామానికి రాకపోకలు నిలిచాయి. గ్రామానికి చెందిన 15 నెలల బాలుడు అస్వస్థతకు  గురికాగా, డ్రోన్​ సాయంతో మెడిసిన్​ పంపిణీ చేశారు. 25 ఏండ్ల తర్వాత బీబీపేట చెరువు మత్తడి దుంకుతోంది. 
  • ఆదిలాబాద్​ జిల్లా బెల్లంపల్లి రీజియన్​లోని మందమర్రి, శ్రీరాంపూర్​, బెల్లంపల్లి ఏరియాల్లో ఓపెన్​ కాస్ట్​ గనుల్లో బొగ్గ ఉత్పత్తి ఆగిపోవడంతో సింగరేణి సంస్థకు రూ. 10 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆఫీసర్లు చెప్పారు. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు 36 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలుతున్నారు. 

ఇయ్యాల స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు బంద్​

భారీ వర్షాల కారణంగా మంగళవారం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ప్రకటిస్తున్నట్లు  సీఎస్  సోమేశ్‌ తెలిపారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రం కొనసాగుతాయి.

అసెంబ్లీ, మండలి 3 రోజులు వాయిదా

అసెంబ్లీ, మండలి సమావేశాలను వర్షాల వల్ల  మూడు రోజులు వాయిదా వేశారు. తిరిగి అక్టోబర్​ 1న పొద్దున 10 గంటలకు రెండు సభలు ప్రారంభం కానున్నాయి.

మర్రిగడ్డలో 18 సెం.మీ. వర్షపాతం

సోమవారం అత్యధికంగా సిరిసిల్ల జిల్లా మర్రిగడ్డలో 18.13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 16.13, సిరిసిల్ల జిల్లా నాంపల్లిలో 15.98, ఖమ్మం జిల్లా బచ్చోడులో 15.15, కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి ధర్మారంలో 14.8 సెం.మీ. రికార్డయింది.  హైదరాబాద్​ రాజేంద్రనగర్​లో 11.15, మలక్​పేట్​లో 7.80,  మాదాపూర్​లో 7.5 సెం.మీ. నమోదైంది. రాష్ట్రంలో 20 ప్రాంతాల్లో అతి భారీ, 124 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. 626 ప్రాంతాల్లో మోస్తరు, 150 ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.

మరో నాలుగు రోజులు వర్షాలు

గులాబ్ తుపాను ప్రభావంతో మంగళవారం నుంచి రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా మంగళవారం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

అలర్ట్ గా ఉండండి.. సీఎస్ కు గవర్నర్ ఆదేశం

గులాబ్  ఎఫెక్ట్ తో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై గవర్నర్ తమిళి సై ఆరా తీశారు. సోమవారం సీఎస్ సోమేశ్ కుమార్ కు ఫోన్ చేసి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నందున 24 గంటలూ అలర్ట్ గా ఉండాలని గవర్నర్ ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ ​టీంలను రెడీగా ఉంచామని, కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామని గవర్నర్‌‌కు సీఎస్ తెలిపారు. సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ టీంలు సిద్ధంగా ఉన్నాయన్నారు. అధికారులను రౌండ్ ది క్లాక్ అలర్ట్ గా ఉంచుతూ, మానిటర్ చేయాలని సీఎస్ ను గవర్నర్ ఆదేశించారు.

నష్టం జరగకుండా చూడాలె: సీఎం

భారీ వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. రాష్ట్రంలో పరిస్థితులపై సోమవారం ఢిల్లీ నుంచి సీఎస్‌‌‌‌‌‌‌‌ సోమేశ్​ కుమార్‌‌‌‌‌‌‌‌తో రివ్యూ నిర్వహించారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అలర్ట్​గా ఉండాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో సీఎస్‌‌‌‌‌‌‌‌ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, సమాచారాన్ని సెక్రటేరి యట్‌‌‌‌‌‌‌‌లోని కంట్రోల్ రూంకు అందించాలన్నారు. కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని కమిషనర్లు, ఎస్పీలను డీజీపీ మహేందర్‌‌రెడ్డి అన్నారు.