విశాఖ జిల్లాకు రెడ్ అలర్ట్

విశాఖ జిల్లాకు రెడ్ అలర్ట్

అసని తుఫాను బుధవారం బలహీనపడినా.. క్రమంగా విశాఖ తీరం వైపు రావొచ్చన్న హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ విశాఖ జిల్లాపై తుఫాను ప్రభావం ఉండొచ్చని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేసింది. రేపు కూడా కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయొచ్చని అంచనా వేశారు. విశాఖ జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయం, జీవీఎంసీ, మెడికల్, ఫైర్, పంచాయతీ రాజ్ సిబ్బందితో ప్రత్యేక బృందాలు రక్షణ చర్యలకు సిద్ధంగా ఉంచారు. కలెక్టరేట్ లో 24 గంటల పనిచేసేలా... కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

రెండ్రోజులుగా ఈదురుగాలు, భారీ వర్షాలతో భయపెట్టిన అసని తీవ్ర తుఫాను.. నిన్న ఉదయానికి తుఫానుగా బలహీనపడింది. రాత్రిక తీవ్ర వాయుగుండగా మారి... మచిలీపట్నానికి 20 కిలోమీటర్లు, నరసాపురానికి 40 కిలోమీటర్ల మధ్య తీరాన్ని దాటింది. తుఫాను ప్రభావంతో.. మంగళ, బుధ వారాల్లో నెల్లూరు, ప్రకాశం, విశాఖ, శ్రీకాకుళం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో 15.5 సెంటీమీటర్లు, తిరుపతి జిల్లా ఓజిలిలో 13.6 సెంటీమీటర్ల గరిష్ఠ వర్షపాతం నమోదైంది.

నిన్న ఉదయం నుంచి తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఉప్పాడ-కొత్తపల్లి రహదారి కెరటాల ధాటికి ధ్వంసమైంది. ప్రత్తిపాడు మండలం ఇ.గోకవరంలో వరదకాలువపై అప్రోచ్ వంతెన కూలిపోయింది. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవం నుంచి ఉప్పరాపల్లికి బైక్ పై వెళ్తున్న ఎంపీటీసీ సభ్యుడు కాసులుపై కొబ్బరి చెట్టు విరిగిపడి స్పాట్ లోనే చనిపోయాడు. అమలాపురం మండలం అప్పన్నపేటలో పూరిల్లు కూలి వ్యక్తి చనిపోయాడు.

అసని తీవ్రతతో భారీ వర్షాలు, అధిక వేగంతో ఈదురు గాలులు వీచాయి. దీంతో వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం కలిగింది. అరటి , బొప్పాయి, కూరగాయల రైతులు పెద్దఎత్తున నష్టపోయారు. ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు తీవ్రంగా కష్టపడ్డారు. బాపట్లలో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఏలూరులో గాలుల ధాటికి మూడు చోట్ల పవర్ ఫీడర్లు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో 900 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. మామిడి పంటకు భారీ నష్టం కలిగింది.

అసని బలహీనపడి తీవ్రవాయుగుండంగా మారినా.. కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. మత్స్యకారులు గురువారం వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో నిన్నఏపీలో పలు విమాన సర్వీసులు రద్దు చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను తీవ్రత తగ్గిందని... గురువారం మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిన్న అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొత్తపల్లిలో 2.7 సెంటీమీర్లు, నీల్వాయిలో 2.2 సెంటీమీటర్ల వర్షం పడింది. మరోవైపు మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వర్షాలతో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకోవడంతో.. వాతావరణం చల్లబడింది. రెండ్రోజుల క్రితంతో పోలిస్తే హైదరాబాద్ లో 10 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. వర్షాలు పడే ఛాన్స్ ఉందని ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాని అధికారులు సూచించారు.