
- ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు
- అలుగుపారుతున్న చెరువులు
- పలు గ్రామాలకు రాకపోకలు బంద్
- నిండుతున్న నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులు
నిజామాబాద్, కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. శనివారం ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి శనివారం సాయంత్రం 1625 క్యూసెక్కుల వరద వస్తుంది. కళ్యాణి ప్రాజెక్ట్‌లోకి 640 క్యూసెక్కుల నీరు వస్తుంది. పోచారం ప్రాజెక్ట్‌లోకి 9వే క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. లింగంపేట పెద్ద వాగు, కాసుల కత్త వాగు, తాడ్వాయి మండలంలోని భీమేశ్వరం వాగు, దేమీకలాన్ సమీపంలో వాగు, రామారెడ్డి మండలంలోని గంగమ్మ వాగు, సదాశివనగర్ మండలంలోని పెద్ద వాగు, అమర్లబండ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు చెరువులు అలుగు పారుతున్నాయి.
పలు చోట్ల రాకపోకలు బంద్..
పోతంగల్ మండలం కొల్లూర్- దోమలెడ్గి బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా సిమెంట్ పైప్‌లు, మట్టితో ఏర్పాటు చేసిన దారి కొట్టుకుపోయింది. దీంతో బోధన్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రూర్ మండలంలో లింగంపల్లి చెరువు నిండి అలుగు పారి బొప్పాపూర్ రోడ్డు మీదుగా ప్రవహించడంతో దారి క్లోజ్ చేశారు.
ఇందల్వాయి మండలం లింగాపూర్ వాగు మీదుగా ధర్పల్లి వెళ్లే వెహికల్స్‌ను పోలీసులు డైవర్ట్ చేశారు. గంగమ్మ వాగు, కనకల్ దేమే మధ్య వాగు వద్ద రాకపోకలను నిలిపివేశారు. సదాశివనగర్ మండలం అమర్లబండకు చెందిన విద్యార్థులను గ్రామస్తులు ట్రాక్టర్‌తో వాగు దాటించారు. వాగుల వద్ద బారీ కేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు పోలీసు సిబ్బందిని నియమించారు.