హైదరాబాద్‌లో రోజంతా ముసురే .. మరో మూడురోజుల పాటు భారీ వానలు

హైదరాబాద్‌లో రోజంతా ముసురే .. మరో మూడురోజుల పాటు భారీ వానలు
  •  మరో మూడురోజుల పాటు భారీ వానలు  
  •  ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ 
  •  మాన్సూన్ టీమ్స్​ 24 గంటలు పనిచేయాలన్న హైడ్రా చీఫ్​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: రెండు రోజులుగా నగరాన్ని ముసురు వీడడం లేదు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది. గురు,శుక్ర,శనివారాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మంగళవారం సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు వర్షం కురవడంతో బుధవారం ఉదయం రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లక్డీకాపూల్ మెయిన్ రోడ్డులో ఉదయం ఎనిమిది గంటల నుంచే ట్రాఫిక్ జామ్ మొదలైంది.

 ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్ పేట వెళ్లాల్సిన వాహనాలు కిలోమీటర్ పొడవునా క్యూ కట్టాయి. దీంతో ఉదయం ఆఫీసుకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అత్యధికంగా జూబ్లీహిల్స్ లో 4 సెం.మీ.ల వర్షపాతం నమోదు కాగా, మెహిదీపట్నం, లంగర్ హౌజ్ ప్రాంతాల్లో రెండు సెంటీ మీటర్లు నమోదైంది. బుధవారం ఉదయం నుంచి ముసురు కురుస్తూనే ఉంది. సాయంత్రం కొంచం గ్యాప్​ ఇచ్చింది. బుధవారం అత్యధికంగా సైదాబాద్ లో 2.58 సెంటిమీటర్ల వర్షం పడగా, ముషీరాబాద్, మారేడుపల్లి, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో సెంటిమీటర్ లోపు వాన కురిసింది.