భారీ వర్షాలతో రాకపోకలకు తీవ్ర అంతరాయం

భారీ వర్షాలతో  రాకపోకలకు తీవ్ర అంతరాయం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో చాలాచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు పలుచోట్ల రహదారులు ధ్వంసం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లింగాపూర్ చెరువులు మత్తడి దూకుతుంది. గ్రామానికి చెందిన భగవంత్ రెడ్డి అనే వ్యక్తి గల్లంతయ్యాడు. చెరువులో గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. మాచారెడ్డి మండలంలో  పేటచెరువు ఉధ్రుతంగా ప్రవహిస్తుండటంతో ప్రయాణికులతో వెళుతున్న ఆటో చిక్కుకుంది. దీన్ని గమనించిన స్థానికులు తాళ్లు, ట్రాక్టర్ సాయంతో సురక్షితంగా బయటకు తీశారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ శివారులో వాగులో చిక్కుకున్న ఐదుగురు భవన నిర్మాణ కార్మికులను స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి రాజంపేట గ్రామాల మధ్య మొండివాగు ప్రవాహం పెరిగిపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

మేడ్చల్ జిల్లా కీసరలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన రహదారులపై పరిస్థితిని మున్సిపల్ చైర్మన్, కమిషనర్ పరిశీలించారు.