కిక్కిరిసిన ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్... ఊళ్ళ నుంచి తిరిగొచ్చిన జనంతో పెరిగిన రద్దీ

కిక్కిరిసిన ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్... ఊళ్ళ నుంచి తిరిగొచ్చిన జనంతో పెరిగిన రద్దీ

దసరా సెలవులు ముగిసాయి.. స్కూళ్ళు రీఓపెన్ అయ్యాయి. ఆఫీసులకు సెలవు పెట్టి పండక్కి ఊళ్లకెళ్లిన జనం అంతా తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. దీంతో ఆదివారం ( అక్టోబర్ 5 ) హైవేలన్నీ రద్దీగా మారాయి.. సోమవారం ( అక్టోబర్ 6 ) కూడా సిటీకి వచ్చే రోడ్లపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ లో రద్దీ పెరిగింది. ఉల్లా నుంచి తిరిగొచ్చిన జనం అంతా ఇళ్లకు మెట్రోలో వెళ్తుండటంతో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ జనంతో కిక్కిరిసి పోయింది. 

ఊర్ల నుండి వచ్చిన జనాలు కొందరు క్యాబ్ లు బుక్ చేసుకొని తమ ఇండ్లకు చేరుతుండగా... చాలామంది మెట్రోలో వెళ్తున్నారు..దీంతో మెట్రో స్టేషన్ దగ్గర ప్రయాణికుల రద్దీ ఏర్పడింది. మామూలుగానే ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయంలో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారిగా సొంతూళ్లకు వెళ్లినవారంతా రావడంతో ఎప్పుడూ లేనంతగా రద్దీ పెరిగింది. దీంతో చిన్న పిల్లలు, లగేజి ఎక్కువగా ఉన్న జనం తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్ కు వచ్చే హైవేల పై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దసరా పూర్తి చేసుకుని నగరానికి తిరుగు ప్రయాణం అవ్వటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం అయ్యింది. వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకుని చుక్కలు చూస్తున్నారు.
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పండుగకు స్వంత ఊర్లకు వెళ్లి తిరుగు ప్రయాణంతోనే రోడ్లపై కనుచూపు మేర వాహనాలు బారులు తీరాయి. 

వెహికిల్స్ స్లోగా కదులుతుండటంతో.. ఇంకెప్పుడొస్తుందా హైదరాబాద్ అన్నట్లుగా ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. చౌటుప్పల్ ఏరియాలో వాహనాలు బారులు తీరాయి.పంతంగి టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో.. ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.