జపాన్‭లో మంచు తుఫాన్ బీభత్సం..

జపాన్‭లో మంచు తుఫాన్ బీభత్సం..

జపాన్‭లో మంచు తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది. సాధారణం కన్నా మూడు రెట్లు ఎక్కువగా మంచు పడటంతో జనజీవనం స్తంభించింది. మంచు కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందగా.. 93 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. వేలాది ఇళ్లు అంధకారంలోకి చిక్కుకున్నాయి. సుమారు వారం రోజుల నుంచి ఈశాన్య ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుండటంతో వైవేలపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. డెలివరీ సేవలు కూడా ఆలస్యం అయ్యాయి. కొందరు పైకప్పుల్లో పేరుకుపోయిన మంచును తొలగిస్తున్న క్రమంలో కింద పడి చనిపోయారని, మరికొంతమంది మంచులో కూరుకుపోయి మృతి చెందారని అధికారులు తెలిపారు. దీంతో.. మంచు తొలగిస్తున్న సమయంలో జాగ్రత్త వహించాలని, ఒంటరిగా ఆ పని చేయొద్దని మున్సిపల్ అధికారులు సూచించారు.

టోక్యోకు ఉత్తరాన 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న యమగటా ప్రిఫెక్చర్‌లోని నాగై నగరంలో 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మంచు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిందని అధికారులు పేర్కొన్నారు. ఉత్తర జపాన్‌లోని భారీ మంచు కారణంగా ఒక ఎలక్ట్రిక్ పవన్ ట్రాన్స్ మిషన్ పడిపోయింది. దీంతో సుమారు 20వేల ఇళ్లకు విద్యుత్ లేకుండా పోయింది. ప్రస్తుతం విద్యుత్ పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయి.