
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు బయలుదేరడంతో జాతీయ రహదారులన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి.ముఖ్యంగా హైదరాబాద్- విజయవాడ, విజయవాడ- హైదరబాద్ లో రూట్లలో ప్రయాణం చేసే వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ గేట్స్ దగ్గర భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో ఊళ్లకు వెళ్లేందుకు పయనమైన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వారికి నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్‌గేట్‌లో 8 టోల్ గేట్లు తెరిచారు. బూత్‌లో ఫాస్ట్ ట్యాగ్ స్కానర్ పనిచేయకపోవడంతో పాత రేట్ల ప్రకారం డబ్బులు తీసుకొని వాహనాలను పంపుతున్నారు. ఫాస్ట్ టాగ్‌పై అవగాహన లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. టోల్‌గేట్ దగ్గర ప్రత్యేకంగా ఫాస్ట్ టాగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులంతా ఫాస్ట్ టాగ్‌లను తీసుకుంటున్నారు.
కీసర, మాడ్గుపల్లి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల దగ్గర కూడా వాహనాల రద్దీగా బాగా ఉంది. గంటగంటకు హైవేలపై వాహానాల రద్దీ పెరుగుతోంది. టోల్‌ప్లాజాల దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి. కీసర టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరడంతో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. కొన్ని టోల్ ప్లాజాల దగ్గర వాహానదారులు అసహనానికి గురవుతున్నారు. ఫాస్ట్ ట్యాగ్ ఉన్నా టోల్ ప్లాజాల దగ్గర దాదాపు రెండు మూడు గంటలు వేచి ఉండాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగ సమయంలో టోల్ ఫీజు రద్దు చేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కోరుతున్నారు ప్రజలు. గతేడాది సంక్రాంతి టైంలో టోల్ ఫీజ్ ను తెలంగాణ ప్రభుత్వ రద్దు చేసింది. ఈ ఏడాది కూడా రద్దు చేసి త్వరగా స్వస్థలాలకు వెళ్లేలా చూడాలని కోరుకుంటున్నారు ప్రయాణీకులు.