భారత ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 605 పాయింట్లుక్షీణించి 83,576 వద్ద ముగియగా, నిఫ్టీ 194 పాయింట్లు తగ్గి 25,683 వద్ద స్థిరపడింది. వరుసగా ఐదు రోజులుగా మార్కెట్లు పడిపోవడంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. జస్ట్ ఈ ఐదు రోజుల్లోనే బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.13లక్షల 37 వేల కోట్లు తగ్గిపోయింది. అంటే ఈ మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైందన్నమాట. వారం చివరి రోజైన శుక్రవారం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.4లక్షల 38వేల కోట్లు కరిగిపోయింది.
ఈ భారీ పతనానికి ప్రధాన కారణం అమెరికా నుంచి వస్తున్న హెచ్చరికలే. రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అమెరికా భారీగా సుంకాలను విధించే అవకాశం ఉందని వస్తున్న వార్తలు మార్కెట్లను వణికించాయి. రష్యాపై అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై టారిఫ్‌లను 500 శాతం వరకు పెంచే బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలిపారని యూఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం వెల్లడించారు. వచ్చే వారం నుంచే ఈ పెరిగిన సుంకాలు అమలులోకి వచ్చే అవకాశం ఉందన్న వార్త ఇన్వెస్టర్లలో భయాందోళనలను భారీగా పెంచేసింది.
ఇవాళ ఇంట్రాడే ట్రేడింగ్‌లో దిగ్గజ కంపెనీల స్టాక్స్ ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం వంటి షేర్లు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ తీవ్రత ఎంతలా ఉందంటే.. బీఎస్‌ఈలో ట్రేడైన 4,346 షేర్లలో ఏకంగా 3,103 షేర్లు నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. సుమారు 329 స్టాక్స్ తమ 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు కూడా నష్టాల్లోనే ముగిశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నిన్న రూ. 2వేల 544 కోట్ల విలువైన షేర్లను అమ్మేయగా.. దేశీయ ఇన్వెస్టర్లు కొంత మేర కొనుగోళ్లు జరిపి మార్కెట్‌ను స్టేబుల్ చేయటానికి ప్రయత్నించారు.
ఆసియాలోని ఇతర మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ.. భారత స్టాక్ మార్కెట్లు మాత్రం అమెరికా వాణిజ్య ఆంక్షల భయంతో వెనకబడ్డాయి. రాబోయే రోజుల్లో రష్యన్ క్రూడ్ దిగుమతులపై అమెరికా తీసుకోబోయే నిర్ణయాలు భారత మార్కెట్ గమనాన్ని శాసించనున్నాయని నిపుణులు అంటున్నారు.
