ఆగని నష్టాలు.. సెన్సెక్స్ 605 పాయింట్లు డౌన్‌‌

ఆగని నష్టాలు.. సెన్సెక్స్ 605 పాయింట్లు డౌన్‌‌
  • రూ.6.5 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు
  • ట్రంప్ టారిఫ్ భయాల ఒత్తిడిలో మార్కెట్‌‌
  • షేర్లను అమ్మేస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు

ముంబై: మార్కెట్ పతనం కొనసాగుతోంది.  బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు శుక్రవారం  సెషన్‌‌లో అర శాతానికి పైగా పడ్డాయి.  మార్నింగ్ సెషన్‌‌లో కొద్దిగా లాభాల్లోకి వచ్చినా, కొద్ది నిమిషాల్లోనే నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా ఐదో సెషన్‌‌నూ రెడ్‌‌లో ముగించాయి. సెన్సెక్స్ శుక్రవారం 605 పాయింట్లు (0.72 శాతం) తగ్గి 83,576 దగ్గర, నిఫ్టీ 193 పాయింట్లు నష్టపోయి 25,683 దగ్గర  సెటిలయ్యాయి. గత ఐదు సెషన్లలో సెన్సెక్స్‌‌ 2,360 పాయింట్లు (2.5 శాతం) తగ్గింది.

మార్కెట్ పతనానికి కారణాలు..

రష్యా ఆయిల్‌‌ కొంటున్నందుకు  ఇండియాపై అదనంగా 500 శాతం వరకు టారిఫ్ వేస్తామని ట్రంప్ ప్రభుత్వం బెదిరించడంతో మార్కెట్‌‌ పడుతోంది. ఇండియా– అమెరికా వాణిజ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఇరు దేశాల మధ్య బైలేటరల్ ట్రేడ్ ఇప్పటికే కుదరాలి. కానీ, ఆరు నెలలపాటు ఆరు రౌండ్లు జరిగినా, ట్రేడ్ డీల్‌‌లో కదలికలేదు. ఇండియాపై అమెరికా ఇప్పటికే 50 శాతం టారిఫ్ వేస్తోంది. ఇది ఇతర దేశాలపై వేస్తున్న టారిఫ్ కంటే చాలా ఎక్కువ.

ఫారిన్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల(ఎఫ్‌‌ఐఐల)  అమ్మకాలు కొనసాగుతున్నాయి. గురువారం సెషన్‌‌లో నికరంగా రూ.2,367 కోట్ల విలువైన షేర్లను అమ్మిన వీళ్లు, శుక్రవారం మరో రూ.3,600 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఫారిన్ ఫండ్స్ వెళ్లిపోతుండడంతో బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు పడుతున్నాయి.

గ్లోబల్‌‌ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీంతో మన మార్కెట్లు కూడా నెగెటివ్‌‌లో కదులుతున్నాయి. మరోవైపు క్రూడాయిల్  ధరలు పెరుగుతుండడం మార్కెట్లను ఇబ్బంది పెడుతోంది. బ్రెంట్‌‌ క్రూడాయిల్‌‌ శుక్రవారం బ్యారెల్‌‌కు 62.49 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. 

5 ఐపీఓలకి సెబీ అనుమతి

ఐపీఓకి వెళ్లేందుకు ఇండో–ఎంఐఎం, ఓనెమి టెక్నాలజీ సొల్యూషన్స్‌‌,  ఆల్కోబ్రూ డిస్టిల్లరీస్‌‌ ఇండియా, ఆస్తా స్పింటెక్స్‌‌, కుసుమ్​గఢ్​ ‌‌ సెబీ అనుమతులు ఇచ్చింది. రానున్న ఏడాది కాలం వరకు ఈ అనుమతులు పనిచేస్తాయి. టెమాసెక్ హోల్డింగ్స్‌‌కు వాటాలున్న ఓనెమి టెక్నాలజీ సొల్యూషన్స్ కిష్త్‌‌ బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు నడిపిస్తోంది.  

ఫ్రెష్‌‌ షేర్ల ఇష్యూ ద్వారా ఈ కంపెనీ రూ.1,000 కోట్లు, మెటల్ కంపెనీ ఇండో–ఎంఐఎం రూ. వెయ్యి కోట్లు, ఆల్కోబ్రూ రూ.258 కోట్లు, కాటన్ యార్న్ కంపెనీ ఆస్తా స్పింటెక్స్ రూ.160 కోట్లు సేకరించనున్నాయి.  ఇంజనీర్డ్ ఫ్యాబ్రిక్ కంపెనీ కుసుమ్‌గఢ్​ ఆఫర్ ఫర్ సేల్ కింద  రూ.650 కోట్ల వరకు సేకరించనుంది.

2.5% వాటా అమ్మనున్న జియో

రిలయన్స్ జియో ప్లాట్‌‌ఫామ్స్‌‌ ఐపీఓ ద్వారా 4.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.40,500 కోట్లు) సేకరించాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది ఇన్వెస్టర్ల ముందుకు రానున్న జియో, పబ్లిక్ ఇష్యూలో 2.5 శాతం వాటాను విక్రయించనుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ప్రస్తుతం జియోకి 50 కోట్లకి పైగా కస్టమర్లు ఉన్నారు.  కిందటేడాది నవంబర్‌‌‌‌లో ఈ కంపెనీ వాల్యుయేషన్‌‌ను 180 బిలియన్ డాలర్లుగా బ్రోకరేజ్ కంపెనీ జెఫరీస్ లెక్కించింది.

ఇందులో 2.5 శాతం వాటా విలువ 4.5 బిలియన్ డాలర్లు అవుతుంది. కిందటేడాది వచ్చిన అతిపెద్ద ఐపీఓ హ్యుండాయ్ మోటార్ ఇండియా సైజ్ 3.3 బిలియన్ డాలర్లు. గత ఆరేళ్లుగా జియో ఏఐలో పెట్టుబడి పెడుతోంది. కేకేఆర్‌‌‌‌, జనరల్ అట్లాంటిక్‌‌, సిల్వర్ లేక్‌‌, అబుదాబి ఇన్వెస్ట్‌‌మెంట్ అథారిటీ వంటి పెద్ద ఇన్వెస్టర్ల నుంచి ఫండ్స్ సేకరించింది.