- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- మంత్రి వద్దంటున్నా అధికారులు మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారని ప్రశ్న
- భవిష్యత్తులో ఇలాంటి మెమోలు జారీ చేయవద్దని ఆదేశాలు
- టికెట్ రేట్లను పెంచాలని ప్రభుత్వం భావిస్తేనిబంధనల ప్రకారం వెళ్లాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ‘రాజాసాబ్’ సినీ నిర్మాతలకు ఈ నెల 18వ తేదీ వరకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మెమో ప్రకారం శుక్రవారం విక్రయించిన టికెట్లకు ఈ ఉత్తర్వులు వర్తించవని, శనివారం నుంచి పాత ధరల ప్రకారమే టికెట్లను విక్రయించాలని స్పష్టం చేసింది. భవిష్యత్తులో వచ్చే కొత్త సినిమాలకూ టికెట్ ధరల పెంపుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
జీవో 120 ప్రకారమే టికెట్ రేట్లు నిర్ణయించాలంటూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు డివిజన్ బెంచ్‌తో సహా ప్రభుత్వానికి శిరోధార్యమని, వాటికి విరుద్ధంగా తాము ఈ మెమోను అనుమతించలేమని స్పష్టం చేసింది. ‘రాజాసాబ్’ సినిమాకు జనవరి 18వరకు టికెట్రేట్లను పెంచుకోవడానికి అనుమతిస్తూ ఇచ్చిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌లపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ శుక్రవారం మధ్యాహ్నం సుదీర్ఘ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం మెమోలు జారీ చేస్తోందన్నారు. అధిక బడ్జెట్ అని చెప్తున్నారని, అందుకు సంబంధించి ఆడిటింగ్ నివేదికలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
ప్రభుత్వ అనుమతితోనే...
నిర్మాతల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసినపుడు టికెట్ రేట్లను పెంచుకోవడానికి ప్రభుత్వ అనుమతి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే 3 లక్షల టికెట్లు విక్రయించామని, ఆ సొమ్మును వెనక్కి ఇవ్వాలంటే ప్రేక్షకులు థియేటర్లను ధ్వంసం చేసే అవకాశం ఉందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రతిసారి ఇలా ఎందుకు ఉత్తర్వులు జారీ చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి ప్రశ్నించారు. గత నాలుగైదు సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా ఉత్తర్వులను జారీ చేశారని, సినిమా విడుదలయ్యే చివరి నిమిషంలో లేదా కోర్టు సెలవులకు ముందు జారీ చేశారని వ్యాఖ్యానించారు.
ఇకపై సినిమాలకు అధిక రేట్లు వసూలు చేయడానికి ఎలాంటి అనుమతులు ఉండవని, అలాంటి అభ్యర్థనలతో రావద్దని నిర్మాతలకు విజ్ఞప్తి చేస్తూ సాక్షాత్తు మంత్రి ప్రకటించినట్లు చూశామని, అయినా అధికారులు ఇలా మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యంతోపాటు పలు పిటిషన్లపై విచారించిన ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం జీవో 120 ప్రకారం టికెట్ రేట్లను నిర్ణయించాలని స్పష్టం చేసిందన్నారు. ఈ ఉత్తర్వులకు డివిజన్‌బెంచ్‌తో సహా తాము కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. వాటికి విరుద్ధంగా ఉన్న మెమోను అనుమతించలేమన్నారు. టికెట్రేట్లను పెంచాలని ప్రభుత్వం భావిస్తే నిబంధనల ప్రకారం వెళ్లాలని వ్యాఖ్యానించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరడంగానీ, సుప్రీం కోర్టును ఆశ్రయించడంగానీ చేయాలన్నారు. చట్టప్రకారం జీవోలు జారీ చేస్తే తాము జోక్యం చేసుకోబోమన్నారు.
ఉత్తర్వులు సస్పెండ్
‘రాజాసాబ్’ సినిమా టికెట్ రేట్లను వారం పాటు పెంచుకోవడానికి ఇచ్చిన మెమోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు బెంచ్ జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసేదాకా ఈ మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతా యంది. భవిష్యత్తులో వచ్చే కొత్త సినిమాలకు టికెట్రేట్లను పెంచుకోవడానికి అనుమతిస్తూ ఎలాంటి మెమోలు జారీ చేయడానికి వీల్లేదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత మెమో ద్వారా శుక్రవారం విక్రయించిన టికెట్లను యథాతథంగా ఉంచవచ్చని, శనివారం నుంచి పాత ధరలనే వసూలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను సంక్రాంతి సెలవుల తరువాత వాయిదా వేశారు.
