డీబీఎం పద్ధతిలో SLBC పనులు ! టీబీఎం మెషీన్‌‌ తొలగింపు పనులు పూర్తి

డీబీఎం పద్ధతిలో SLBC పనులు ! టీబీఎం మెషీన్‌‌ తొలగింపు పనులు పూర్తి

అచ్చంపేట, వెలుగు : ఎస్‌‌ఎల్‌‌బీసీ సొరంగానికి సంబంధించి మిగిలిన పనులను డ్రిల్లింగ్, బ్లాస్టింగ్‌‌ పద్ధతి (డీబీఎం)లో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. గతేడాది ఫిబ్రవరిలో దోమల పెంట ఇన్‌‌లెట్‌‌ వద్ద జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చనిపోవడంతో అప్పటి నుంచి పనులు నిలిచిపోయాయి. 

ఇన్‌‌లెట్‌‌ నుంచి పనులు చేయడం వీలుకాకపోవడంతో మన్నెవారి పల్లి వద్ద గల అవుట్‌‌లెట్‌‌ నుంచి పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా టీబీఎం బేరింగ్‌‌ మెషీన్‌‌ తీసుకొచ్చినప్పటికీ.. నిపుణుల సలహా మేరకు దానిని బిగించకుండా పక్కన పెట్టారు. తర్వాత 12 మంది ఎక్స్​పర్ట్స్​ టీం ఎస్‌‌ఎల్‌‌బీసీ పరిసరాల్లో రాడార్‌‌ సర్వే నిర్వహించింది. సొరంగం ద్వారా పనులు చేయడం సాధ్యం కాదని నిపుణులు ప్రభుత్వానికి రిపోర్ట్‌‌ ఇవ్వడంతో... పెండింగ్‌‌ పనులను డ్రిల్లింగ్‌‌ అండ్‌‌ బ్లాస్టింగ్‌‌ విధానంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇందులో భాగంగా మన్నెవారిపల్లి వద్ద ఉన్న అవుట్​లెట్‌‌లోని టీబీఎం మెషీన్‌‌ను తొలగించేందుకు 20 మంది కార్మికులు నెల రోజులుగా పని చేస్తున్నారు. గ్యాస్‌‌ కట్టర్ల ద్వారా మెషీన్లను కట్ చేసి టీబీఎం తొలగింపు పనులు పూర్తయినట్లు తెలిసింది. మొత్తం 43.93 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాల్సి ఉండగా.. ఇంకా 9.5 కిలోమీటర్ల పనులు పెండింగ్‌‌లో ఉన్నాయి. ఈ పనులను ఇక డ్రిల్లింగ్‌‌ అండ్‌‌ బ్లాస్టింగ్‌‌ విధానంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఈ పనులను త్వరలోనే ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.