- రాజకీయాల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యం: సీఎం రేవంత్ రెడ్డి
- మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామని ఏపీకి పిలుపు
- కోర్టుల చుట్టూ తిరగడం, కేంద్రం వద్ద పంచాదీలు వద్దు
- మీరు ఒక్క అడుగు ముందుకేస్తే.. మేం పదడుగులు వేస్తం
- ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన కృష్ణా ప్రాజెక్టులకు అనుమతులను అడ్డుకోవద్దు
- తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ కావాలంటే ఏపీ సహకారం కావాలి
- అమరావతి అభివృద్ధికి హైదరాబాద్ సహకారం అవసరం
- రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలి
- రైతులు తమ భూములను అగ్గువకు అమ్ముకోవద్దు
- ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సహకరిస్తే వాటి విలువ పెరుగుతుందని వెల్లడి
- రావిర్యాల ఈ–సిటీలో సుజెన్ మెడికేర్ యూనిట్‌ను ప్రారంభించిన సీఎం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు కావాల్సింది నీళ్లు అని, పక్క రాష్ట్రాలతో వివాదాలు కాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నీటి వివాదాల ముసుగులో రాజకీయ ప్రయోజనాలు పొందాలన్న ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. ‘‘మాకు కావాల్సింది పంట పొలాలకు నీళ్లు.. అంతేగానీ పక్క రాష్ట్రాలతో వివాదాలు కాదు. పొరుగు రాష్ట్రాలతో అనవసరమైన పంచాయితీలు మాకు అస్సలు అవసరం లేదు. రైతుల కళ్లలో ఆనందం చూడాలన్నదే మా తపన తప్ప.. నీటి వివాదాల ముసుగులో చౌకబారు రాజకీయ ప్రయోజనాలు పొందాలన్న ఆలోచన మాకు లేదు. రెండు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే వాటిని సామరస్యపూర్వకంగా, చర్చల ద్వారానే పరిష్కరించుకుందాం’’ అని ఏపీకి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని ఈ–-సిటీలో సుజెన్ మెడికేర్ ఐవీ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ, ఏపీ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటేనే ఇక్కడ పరిశ్రమలు, అక్కడ రాజధాని నిర్మాణాలు శరవేగంగా సాగుతాయని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి పథంలో నడవాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా ప్రత్యేక పాలసీలను రూపొందించామని, 2047 నాటికి తెలంగాణను అత్యున్నత స్థాయికి చేర్చడమే తమ లక్ష్యమని అన్నారు.
రాజకీయాల కోసం రైతుల పొట్ట కొట్టొద్దు..
రాజకీయాల కోసం రైతుల పొట్ట కొట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘‘మీకు పంచాయితీలు కావాలా? రైతాంగానికి నీళ్లు కావాలా? అని ఎవరైనా నన్ను అడిగితే.. నీళ్లే కావాలని చెబుతా. మీకు వివాదాలు కావాలా? సమస్యకు పరిష్కారం కావాలా? అంటే.. శాశ్వత పరిష్కారాన్నే ఎంచుకుంటా. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. న్యాయస్థానాల చుట్టూ ఏండ్ల తరబడి తిరగడం, కేంద్రం దగ్గర పంచాయితీలు పెట్టడం కంటే.. ఇక్కడే రెండు రాష్ట్రాల పెద్దలం కూర్చుని మాట్లాడుకుంటే జఠిలమైన సమస్యలు కూడా సులువుగా పరిష్కారం అవుతాయి. ఒకవేళ పక్క రాష్ట్రం సానుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తే, మేం పది అడుగులు ముందుకు వేసి సమస్యలను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పక్క రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవాలనే ఆలోచన మాకు లేదు. సమస్యల్ని చర్చల ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం’’ అని స్పష్టం చేశారు.
ఆ ప్రాజెక్టులను అడ్డుకోకండి..
ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన కృష్ణా సాగునీటి
ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో ఇప్పుడు అభ్యంతరాలు చెప్పవద్దని ఏపీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘‘మా పాలమూరు-–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, డిండి, ఎస్ఎల్బీసీ, భీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరయ్యాయి. కానీ, ఏపీ అభ్యంతరాల వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు, సీడబ్ల్యూసీ అనుమతులు రాక మాకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకు రుణాలు ఆగిపోతున్నాయి. అంతేకాకుండా యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషరీ ప్రోగ్రాం కింద కేంద్రం నుంచి రావాల్సిన 60 శాతం నిధులు ఆగిపోయి.. రాష్ట్ర ఖజానాపై విపరీతమైన ఆర్థిక భారం పడుతోంది’’ అని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకుందామని ఏపీకి పిలుపునిచ్చారు.
న్యూయార్క్, టోక్యోతోనే పోటీ..
తెలంగాణను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ‘తెలం గాణ రైజింగ్ 2047’ పేరుతో భారీ ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం తెలిపారు. ‘‘తెలంగాణ 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే మా లక్ష్యం. మనం పదే పదే ఏపీతోనో, కర్నాటకతోనో, తమిళనాడుతోనో పోటీ పడుతున్నామని చర్చించుకుంటున్నాం. ఆ చర్చకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలి. మన పోటీ ఇకపై గురుగ్రామ్, బెంగళూరుతో కాదు.. జపాన్, జర్మనీ, న్యూయార్క్, సింగపూర్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాలతోనే. హైదరాబాద్‌లో ఐఎస్బీ, నల్సార్, ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు ఉన్నాయి. గ్లోబల్ సిటీగా ఎదిగే సత్తా మనకు పుష్కలంగా ఉంది” అని పేర్కొన్నారు.
మూడు లేయర్ల జోనల్ పాలసీ..
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మూడు లేయర్ల ప్రత్యేక పాలసీ అమలు చేస్తున్నామని, దీనికోసం సమగ్రమైన డాక్యుమెంట్ విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 2,100 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్‌గా, ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని పెరీ అర్బన్ రీజియన్‌గా, ఆ వెలుపల ఉన్న ప్రాంతాన్ని రూరల్ అగ్రికల్చర్ రీజియన్‌గా విభజించి అభివృద్ధి చేస్తున్నాం. కోర్ అర్బన్‌లో సర్వీస్ సెక్టార్, పెరీ అర్బన్‌లో మ్యాన్‌ఫ్యాక్చరింగ్, రూరల్ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు పెద్దపీ ట వేస్తాం. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడిదారులకు లాభం, ప్రభుత్వానికి ఆదాయం, యువతకు ఉపాధి లభించేలా మా పాలసీలు ఉంటాయి” అని పేర్కొన్నారు.
ఫార్మా హబ్‌గా హైదరాబాద్..
ఫార్మా హబ్‌గా, వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ ఎదిగిందని.. ఇది మనందరికీ గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘దేశంలో ఉత్పత్తి అయ్యే బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం ఒక్క హైదరాబాద్ నగరం నుంచే వస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ప్రపంచాన్ని కాపాడిన నాలుగు వ్యాక్సిన్లలో మూడు ఇక్కడి జీనోమ్ వ్యాలీ నుంచే వచ్చాయి. సుజెన్ మెడికేర్ వంటి సంస్థలు జర్మన్ టెక్నాలజీతో ఇక్కడ యూనిట్లు పెట్టడం శుభపరిణామం. సిలికాన్ వ్యాలీలో దిగ్గజ ఐటీ కంపెనీలు నడుస్తున్నాయి. వాటి సీఈవోలు మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వంటి సంస్థల్లో చదువుకున్న వారే. సత్య నాదెళ్ల, అజయ్ బంగా, శంతను నారాయణ్ వంటి వారు మన విద్యా వ్యవస్థ గొప్పతనానికి నిదర్శనం. ఈ సక్సెస్ స్టోరీని మనం మరింత ముందుకు తీసుకువెళ్లాలి” అని సూచించారు.
స్కిల్స్ ఉంటే అద్భుత అవకాశాలు..
రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, వాళ్లందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలంటే ప్రైవేట్ రంగానిదే కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘మేం ఇప్పటి వరకు 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.. భవిష్యత్తులోనూ ఇస్తాం. కానీ లక్షలాది మందికి ఉపాధి దొరకాలంటే పరిశ్రమలు రావాలి. ప్రస్తుతం ఐఏఎస్ ఆఫీసర్‌కు వచ్చే జీతం కంటే.. కార్పొరేట్ కంపెనీల్లో సీఈవోలకు, ఐటీ నిపుణులకు వచ్చే ప్యాకేజీలే చాలా రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. కోటి నుంచి పది కోట్ల ప్యాకేజీలు మన కళ్ల ముందే చూస్తున్నాం. యువత కేవలం ప్రభుత్వ కొలువుల వైపే చూడకుండా, నైపుణ్యాలను పెంచుకుని ప్రైవేట్ రంగంలో వస్తున్న సువర్ణావకాశాలను అందిపుచ్చుకోవాలి” అని సూచించారు.
రెండు రాష్ట్రాలకూ నష్టం జరగొద్దు
తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడం ఒక లోటు అని, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే పోర్టు కనెక్టివిటీ అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘తెలంగాణకు మచిలీపట్నం లేదా కృష్ణపట్నం పోర్టు కనెక్టివిటీ కావాలంటే ఏపీ సహకారం తప్పనిసరిగా ఉండాలి. అందుకే మచిలీపట్నం పోర్టుకు భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి రైల్వే లైన్, 12 లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే కోసం కేంద్రం అనుమతులు కోరాం. అలాగే ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే అక్కడ కేవలం భవనాలు కడితే సరిపోదు. ఆ నగరానికి పరిశ్రమలు రావాలన్నా, సాంకేతిక నిపుణులు కావాలన్నా హైదరాబాద్ సహకారం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకెళ్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. లేదంటే రెండు రాష్ట్రాల ప్రజలు నష్టపోతారు” అని అన్నారు.
జూబ్లీహిల్స్ కంటే గొప్పగా ఫ్యూచర్ సిటీ
భారత్ ఫ్యూచర్ సిటీ దేశానికే తలమానికం కాబోతున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో ఉంటున్నామని చెప్పుకోవడం స్టేటస్ సింబల్. కానీ, రాబోయే పదేండ్లలో భారత్ ఫ్యూచర్ సిటీలో ఉంటున్నామని చెప్పుకోవడం అంతకు మించిన స్టేటస్ సింబల్‌గా మారుతుంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. రైతులు తమ భూములను అగ్గువకు అమ్ముకొని నష్టపోవద్దు. అభివృద్ధికి సహకరిస్తేనే మీ భూముల విలువ పెరుగుతుంది. రైతులు ప్రభుత్వానికి, పరిశ్రమలకు సహకరించి ఈ ప్రాంత పురోగతిలో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.
