మేడారం జాతరను రాజకీయాలకతీతంగా సక్సెస్‌‌ చేసుకుందాం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌ రావు

మేడారం జాతరను రాజకీయాలకతీతంగా సక్సెస్‌‌ చేసుకుందాం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌ రావు
  • మేడారంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి నిధులు

    
ములుగు/తాడ్వాయి, వెలుగు : మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను రాజకీయాలకతీతంగా సక్సెస్‌‌ చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌‌రావు పిలుపునిచ్చారు. గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకు సమ్మక్క సారలమ్మ పేరిట జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 

శుక్రవారం ములుగు జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాంతో కలిసి గట్టమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో ర్యాలీగా మేడారం చేరుకున్న రాంచందర్‌‌రావు వనదేవతలను దర్శించుకొని ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ములుగు జిల్లా ఏర్పాటు కోసం తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు శాసనమండలిలో మాట్లాడానని గుర్తు చేశారు. 

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ అభివృద్ధికి ప్రసాద్‌‌ స్కీంలో భాగంగా కేంద్రం రూ.150 కోట్లు కేటాయించిందన్నారు. ములుగు మున్సిపల్‌‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని, కేంద్రం నిధులు తీసుకొచ్చి ములుగును అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ అభివృద్ధి కోసం నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, నిత్యం ప్రజల్లో ఉంటూ సేవ చేయాలని పిలుపునిచ్చారు.

 కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వీరేందర్‌‌ గౌడ్‌‌, గౌతంరావు, ట్రెజరర్‌‌ వాసుదేవరావు, జిల్లా ఇన్‌‌చార్జి కొరదాల నరేశ్‌‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలపూడి భాస్కర్‌‌రెడ్డి, భుక్యా రాజు నాయక్‌‌, జవహర్‌‌లాల్‌‌, గుగులోతు స్వరూప, జిల్లా ప్రధాన కార్యదర్శులు రవీంద్రాచారి, జాడి వెంకట్, నగరపు రమేశ్, జిల్లా ఉపాధ్యక్షులు జినుకల కృష్ణాకర్‌‌రావు, ఏనుగు రవీందర్‌‌రెడ్డి పాల్గొన్నారు.