
హైదరాబాద్, వెలుగు: కారులో వెళ్తుంటే అకస్మాత్తుగా మంటలు చెలరేగడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎండకాలం మొదలైనప్పట్నుంచి కార్లలో సడెన్ గా మంటలు చెలరేగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈమధ్య హయత్ నగ వద్ద హైదరాబాద్- విజయవాడ హైవేపై వెళ్తున్న కారులో హఠాత్తుగా మంటలు వచ్చాయి. చూస్తుండగానే కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో కారు యాజమాని తప్పించుకొని బయటపడ్డాడు. మార్చిలోనూ ఔటర్రింగ్రోడ్ వద్ద ఉన్నట్టుండి కారు మంటల్లో చిక్కుకుంది. ఈ సమయంలో కారు డోర్ ఓపెన్ చేయలేక అందులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. గత 15 రోజుల్లో సిటీలో రెండుచోట్ల ఇలాంటి ఘటనలే జరిగాయి. దీంతో కారులో హాయిగా ఏసీ వేసుకుని ప్రయాణం చేద్దామనుకుంటున్న వాహనదారులు హడలిపోతున్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.
ఎలక్ట్రికల్ వైరింగ్
ఎండకాలంలో కారు నిర్వహణలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. దీంతో కారు ఇంజన్ త్వరగా హీటెక్కుతుంది. ఈ నేపథ్యంలో మెయింటనెన్స్ విషయంలో అశ్రద్ధ చూపొద్దు. చాలామంది సరైన సర్వీసింగ్ చేయించకుండానే లాంగ్ డ్రైవ్ లకు వెళ్తుంటారు. కారు కొన్న సందర్భంలో ఉన్న వాటికి అదనపు ఫిట్టింగ్స్ చేయిస్తుంటారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటంలో నిర్లక్ష్యం చేస్తారు. కారులో వచ్చే నాణ్యమైన వైర్లను కట్ చేయడం, నాణ్యత లేని వేరే వైర్లను జత చేస్తుంటారు మెకానిక్లు. ఈ వైర్లు రాపిడికి గురవడంతోపాటు మండుతున్న ఎండలకు మంటలు చెలరేగే ప్రమాదముంది. సౌండ్ సిస్టం సరిగా అమర్చకపోవటం, అదనపు పవర్ కోసం బ్యాటరీకి నేరుగా వైర్లు కనెక్ట్ చేయడం కూడా ప్రమాదానికి కారణమవుతుంది. బ్యాటరీ పై లోడ్ పెరిగి మంటలు చెలరేగుతాయి. ఎక్స్ ట్రా ఫిట్టింగ్ కోసం పవర్ ఫూల్ ను పెట్టడ, కూలెంట్ లెవల్స్ ను సరిగా అడ్జెస్ట్ చేయకపోవటం, నాసిరకం ఎలక్ట్రిక్ యాక్ససరీలు, ఎలక్ట్రికల్ వైరింగ్ స్టేషన్ ట్యాంపరింగ్ వల్ల కూడా షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంటుంది.
వీటిని సరిచూసుకోవాలి
అరిగిన టైర్లతోనే లాంగ్ డ్రైవ్ లకు వెళ్లడం ప్రమాదకరం. టెంపరేచర్లు పెరిగి రోడ్లు వేడెక్కడంతో టైర్లకు రోడ్లకు మధ్య స్పార్క్ ఏర్పడి మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లే ముందు కార్ కండిషన్ చెక్ చేసుకోవాలి. సైలెన్సర్ తో పాటు క్వాటలిక్ కన్వర్టర్స్ పెద్ద మొత్తంలో వేడిని పుట్టిస్తాయి.
దీంతో వీటి సమీపంలో ఉండే ప్లాస్టిక్ మెటీరియల్ కాలిపోతుంది. ఇంధనం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. పెట్రోల్ లేదా డిజీల్ లీకైతే ప్రస్తుతమున్న ఉష్ణోగ్ర్తతలకు మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. ఫాగ్ లైట్ల నాణ్యత కారు సామర్థ్యాన్ని బట్టి ఉండకపోవడం కూడా ప్రమాదానికి దారితీస్తుంది. కారు బంపర్లకు వీటిని అమర్చితే తీగలు కరిగిపోయి షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదముంది.
జాగ్రత్తలు
- ఎండకాలంలో దూర ప్రాంతాలకు వెళ్లేప్పుడు మధ్య, మధ్యలో ఆగుతూ ఉండాలి. ఇంజన్ వేడి తగ్గిన తర్వాత మళ్లీ ప్రయాణం ప్రారంభించాలి.
- కార్లలో సిగరెట్ తాగక పోవటం మంచిది. వ్యాక్యుమ్ క్లీనర్లను వాడవద్దు.
- హెడ్ లైట్లు మార్చాలనుకుంటే బ్రాండెడ్ కంపెనీల లైట్లనే వాడాలి.
- మంటలు ఆర్పేందుకు కచ్చితంగా చిన్న సైజు పరికరాన్ని ఉంచాలి. ఐదు లీటర్ల వరకు నీళ్ల బాటిళ్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలి.
- ఇంజన్ నుంచి పొగలు వస్తున్నట్లు అనిపించగానే వెంటనే ఇంజన్ ఆపేసి వైరింగ్ ను చెక్ చేయాలి.
- సెల్ ఫోన్ల చార్జర్ల విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. ఎక్కువ సాకెట్లున్న చార్జర్ల కారణంగా మంటలు వచ్చే ప్రమాదం ఉంది.
ఏం చేయాలి
- కారులో మంటలు చెలరేగినట్లు గుర్తిస్తే వెంటనే కారును పక్కన ఆపేసి మంటలు ఎక్కడ్నుంచి వస్తున్నాయో గమనించాలి
- చిన్న మంటలే అయితే నీళ్లతో ఆర్పిందేకు యత్నించాలి. మంటలు ఎక్కువగా ఉంటే అగ్ని మాపక సిబ్బందికి ఫోన్ చేయాలి
- ఏ మాత్రం కాలిన వాసన వచ్చిన కారును ఆపి వైరింగ్ ను చెక్ చేయాలి.