అలర్ట్: 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

V6 Velugu Posted on Sep 27, 2021

గులాబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు గ్రేటర్ హైదరాబాద్ కు అలర్ట్ జారీ చేశారు అధికారులు. వచ్చే 4 నుంచి 5 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అటు ఖమ్మం, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపారు. 

గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. జీడిమెట్ల, కొంపల్లి, కుత్బుల్లాపూర్ , కూకట్ పల్లి, అంబర్ పేట్ , కాచిగూడ, గోల్నాక, నల్లకుంట, ఉప్పల్, రామంతాపూర్, పీర్జాదిగూడ, మేడిపల్లి, బోడుప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్  ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఉదయం నుంచి గ్రేటర్ హైదరాబాద్ సిటీలో వర్షం పడుతూనే ఉంది. కాసేపు దంచికొడుతున్న వాన.. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ పడుతుంది. సిటీలో చాలాచోట్ల మోస్తరు వర్షాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనం అవస్థలు పడుతున్నారు. అటు లోతట్టు ప్రాంతాల కాలనీలకు వర్షపు నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షంతో చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి.

భారీ వర్షాలతో GHMC అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఇద్దరు అధికారులతో కలెక్టరేట్ లో కంట్రోల్  రూమ్  ఏర్పాటు చేశారు. అటు మేయర్ గద్వాల విజయలక్ష్మీ.... వర్షాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ లో అధికారులను అలర్ట్ చేశామన్నారు. ఖమ్మం జిల్లా వైరా, ఏన్కూర్, కొణిజర్ల, తల్లాడ మండలాల్లో గులాబీ తుపాన్ ప్రభావంతో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అర్థరాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురవడంతో  డ్రైనేజీలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి.. జనం ఇబ్బందులకు గురవుతున్నారు. వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులు దాటి నాలుగు అలుగులపై వరద ప్రవహిస్తోంది. దీంతో స్నానాల, లక్ష్మీపురం, సిరిపురం గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. 

కొణిజర్ల మండలం తీగల బంజారా గ్రామ సమీపంలోని పొగిడే వాగు, జన్నారం సమీపంలోని అంజనాపురం వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో.. పల్లిపాడు నుంచి  ఏన్కూరుకు రాకపోకలు బందయ్యాయి. వాగు పొంగే సమయంలో ఇసుక లారీ దాటుతుండగా అదుపుతప్పి పల్టీ కొట్టింది. డ్రైవర్ ను తాడు సహాయంతో స్థానికులు కాపాడారు. వైరా మున్సిపాలిటీ 5, 12, 16 వార్డుల్లోని లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లన్నీ జలమయమయ్యాయ. పల్లిపాడు గ్రామంలో డబుల్ బెడ్రూమ్  ఇండ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. చెరువులు కుంటలు వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో.. పంటపొలాలు మునిగి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఈదురుగాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయాయి.

Tagged Hyderabad, Telangana, heavy rain,

Latest Videos

Subscribe Now

More News