
నల్గొండ జిల్లా: నార్కట్ పల్లి ఫ్లై ఓవర్పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దసరా పండుగకు ఊళ్లకు వెళ్లిన వాళ్లంతా లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేసి హైదరాబాద్ బాట పట్టారు. దీంతో వాహనాల తాకిడి భారీగా పెరిగింది. విజయవాడతో పాటు అద్దంకి హైవేపై వచ్చే వాహనాలు కూడా ఈ ఫ్లై ఓవర్పై ఎంటర్ అవడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగింది. అంబులెన్సులు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నప్పటికీ ఒక్కసారిగా వందలాది వాహనాలు రావడంతో దారి ముందుకు సాగడం లేదు. చిట్యాల, పెద్ద కాపర్తి దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి.
పండుగ సందర్భంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలిసి కూడా సదరు కాంట్రాక్టర్ ఆల్టర్నేట్ రోడ్డు ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితిని గమనించి నార్కెట్ పల్లి-అద్దంకి రహదారిపై వస్తున్న భారీ వాహనాలను తిప్పర్తి పోలీసులు సైడ్ పెట్టించారు. పండుగ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలిసి కూడా పోలీసులు మినహా.. రోడ్డు ట్రాన్స్ పోర్ట్ అథారిటీ అధికారులు కనీసం పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై వాహనదారులు మండిపడుతున్నారు.
►ALSO READ | హైదరాబాద్ నార్సింగిలో ఘోరం ఆగి ఉన్న బైకు,కారును ఢీకొన్న BMW.. మహిళకు తీవ్ర గాయాలు..
రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో సొంత వాహనాల్లో, బస్సుల్లో ప్రయాణం చేస్తున్న చిన్నారులు, వృద్ధులు నరకం చూస్తున్నారు. హైవే –65 తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కీలకమైనది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు181.50 కిలోమీటర్లు ఉంది. దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైవే కావడం గమనార్హం.