
కొలంబో: మహిళల ప్రపంచ కప్ 2025లో పాకిస్తాన్పై భారత్ విజయం సాధించింది. పాకిస్తాన్పై 88 పరుగుల తేడాతో గెలిచి మహిళల ప్రపంచ కప్ 2025లో వరుసగా రెండో విజయాన్ని హర్మన్ ప్రీత్ సేన నమోదు చేసింది. 248 పరుగుల లక్ష్య సాధనలో పాక్ విఫలమైంది. పాక్ బ్యాటర్ సిద్రా అమీన్ 81 పరుగులు చేసినా టీమిండియా బౌలర్ల ధాటికి ఇతర బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆమె ఒంటరి పోరు వృథా అయింది.
పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. హర్లీన్ డియోల్ 46 పరుగులు, రిచా ఘోష్ 35 పరుగులు (నాటౌట్), జెమిమా రోడ్రిగ్యూస్ 32 పరుగులు, ప్రతీక రావల్ 31 పరుగులు, దీప్తి శర్మ 25 పరుగులు, స్మృతి మందన 23 పరుగులు, స్నేహ్ రాణా 20 పరుగుల లో స్కోర్స్కే పరిమితం కావడంతో టీమిండియా 247 పరుగులు చేసింది.
248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా చెమటలు పట్టించారు. క్రాంతి గౌడ్ 3 వికెట్లు, దీప్తి శర్మ 3 వికెట్లు, స్నేహ్ రాణా 2 వికెట్లను పడగొట్టి పాకిస్తాన్ను ఓడగొట్టారు. ఒక్క సిద్రా అమీన్ 81 పరుగులు మినహాయిస్తే పాకిస్తాన్ బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. నటాలియా పర్వేజ్ 33 పరుగులతో పర్లేదనిపించింది. సిద్రా నవాజ్ 14 పరుగులు చేసింది.
మిగిలిన పాక్ ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్స్ కే పరిమితమయ్యారు. ఇద్దరు డకౌట్ కూడా కావడం గమనార్హం. ఇలా.. బ్యాటింగ్లో తడబడినప్పటికీ బౌలింగ్లో సత్తా చాటి టీమిండియా పాకిస్తాన్ను మట్టి కరిపించింది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఇప్పటికే ఇండియా చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీమిండియా మహిళల జట్టు కూడా పాకిస్తాన్ మహిళల జట్టును ఓడించి పాకిస్తాన్ ను దెబ్బ మీద దెబ్బ కొట్టింది.