
హైదరాబాద్: దసరా సెలవులు ముగించుకొని పల్లెల నుంచి హైదరాబాద్ సిటీకి పబ్లిక్ తిరుగు పయనమయ్యారు. ఉత్తర తెలంగాణ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులలో జనం కిక్కిరిసిపోయారు. జేబీఎస్ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నారు. రేపు (సోమవారం) వర్కింగ్ డే కావడంతో ఉదయంతో పోలిస్తే సాయంత్రానికి సిటీలో ట్రాఫిక్ పెరిగింది.
సిటీకి వచ్చే వాహనాలతో హైవేలు రద్దీగా కనిపించాయి. లగేజ్లతో వస్తున పబ్లిక్కు కచ్చితంగా ఆటో అవసరం ఉంటుందనే కారణంగా ఆటోవాలాలు భారీగా ఛార్జీలను పెంచేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితులున్నాయి. ఎక్కువ సంఖ్యలో స్టూడెంట్స్ బైక్ బుక్ చేసుకోవడంతో కొంత మందికి రాపిడో, ఓలా ,ఉబర్ టూ వీలర్స్ బుక్ కావడం లేదు. క్యాబ్ ల కోసం కూడా గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది.
JBS నుంచి వెళ్లే సిటీ బస్సుల్లో ఫుల్ రష్గా కనిపించాయి. దసరా సెలవులు ముగిసి జనం పట్నం బాట పట్టడంతో కరీంనగర్ రేణిగుంట టోల్ ప్లాజా దగ్గర ఫుల్ రష్ కనిపించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర కూడా వాహనాల రద్దీ కొనసాగుతుంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర 16 టోల్ వసూలు గేట్లు ఉండగా.. హైదరాబాద్ వైపు 10 టోల్ వసూల్ గేట్లను ఓపెన్ చేసి ట్రాఫిక్ లేకుండా టోల్ ప్లాజా సిబ్బంది వాహనాలను పంపిస్తున్నారు.
టోల్ ప్లాజాల దగ్గర పరిస్థితి ఇది:
* దసరా సెలవులు ముగియడంతో పల్లెలు వదిలి పట్టణాలకు బయల్దేరిన వాహనదారులు
* కోర్లపహాడ్ టోల్ గేట్ వద్ద హైదరాబాద్ వైపు ఎనిమిది టోల్ ప్లాజా బూతులు ఓపెన్ చేసి వాహనాలను పంపిస్తున్న టోల్ ప్లాజా సిబ్బంది.
* టోల్ ప్లాజా దగ్గర ఆలస్యం అవుతుండటంతో నెమ్మదిగా వెళుతున్న వాహనాలు
* చిట్యాల జాతీయ రహదారి 65 పై వాహనాల రద్దీ
* చిట్యాలలో ఫ్లై ఓవర్ పనులు జరుగుతుండటంతో నెమ్మదిగా ముందుకు కదులుతున్న వాహనాలు
* వాహనాలు స్లోగా కదలడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. చౌటుప్పల్లోనూ ఇదే పరిస్థితి