
ఆస్ట్రేలియాతో జరగబోయే వైట్ బాల్ ఫార్మాట్ కు టీమిండియా స్క్వాడ్ ను శనివారం (అక్టోబర్ 4) ప్రకటించారు. అజిత్ అగార్కర నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వన్డే, టీ20 ఫార్మాట్ కు జట్టును ప్రకటించారు. టీ20 జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోయినా వన్డే జట్టులో అనూహ్య నిర్ణయాలను తీసుకుంది. ఊహించని సెలక్షన్ తో ఆశ్చర్యానికి గురి చేసింది. రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించి గిల్ కు సారధ్య బాధ్యతలు అప్పగించారు. వికెట్ కీపర్ గా అనుభవజ్ఞుడు సంజు శాంసన్ కు కాకుండా ధృవ్ జురెల్ కు ఛాన్స్ ఇవ్వడం షాకింగ్ కు గురి చేస్తుంది. ఈ విషయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు.
ఆస్ట్రేలియాతో జట్టు ప్రకటించే ఒక రోజు ముందు జురెల్ తన తొలి టెస్ట్ సెంచరీ సాధించి మిడిల్ ఆర్డర్‌లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగలడని నిరూపించాడు. ఈ కారణంగానే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ శాంసన్ స్థానంలో జురెల్ కు ఛాన్స్ ఇచ్చినట్టు తెలిపాడు. "సంజు శాంసన్ టాప్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్ చేస్తాడు. అతని సెంచరీ కూడా మూడో స్థానంలో ఆడినప్పుడు వచ్చింది అనుకుంటున్నాను. జురెల్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలడు. కెఎల్ (రాహుల్) కూడా మిడిల్ ఆర్డర్ లో ఆడతాడు. రాహుల్ లేని టైమ్ లో అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు జురెల్ అని భావిస్తున్నాం. ధృవ్ ఎంత మంచి ఆటగాడో మీరు చూశారు.
మీరు బ్యాటింగ్ ఆర్డర్ పరిశీలిస్తే జురెల్ మిడిల్ కు ఆర్డర్ కు సరిపోతాడు. రాహుల్ ను భర్తీ చేసే ఆటగాళ్ల కోసం వెతుకుతున్నాం. ప్రస్తుతం టీ20ల్లో శాంసన్ మిడిల్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ వన్డే క్రికెట్ లో ఈ స్థానంలో బ్యాటింగ్ భిన్నంగా ఉంటుంది. మేము జురెల్ ను ఐదో స్థానంలో ప్రయత్నిచాలనుకుంటున్నాం". అని అగార్కర్ అన్నాడు. జురెల్ కు ఇప్పటివరకు వన్డే క్రికెట్ ఆడిన అనుభవం లేదు. మరోవైపు శాంసన్ కు వన్డే క్రికెట్ లో అద్భుతమైన రికార్డ్ ఉంది. 16 వన్డేల్లో 56 యావరేజ్ తో 512 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీ.. 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో సిరీస్:
2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ లలో వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత వన్డే జట్టు :
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ , హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ధృవ్ జురెల్, యశస్వి జైశ్వాల్