
- ఇప్పటికే దాదాపు వెయ్యి ఎకరాలు స్వాధీనం
- వీటి విలువ రూ.60 వేల కోట్లు
- హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి
- జిల్లాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల కబ్జాలు
- హైడ్రా సాయంతో ఆక్రమణలు
- ఒక్కొక్కటిగా తొలగిస్తున్న సర్కార్
- కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్న
- కేసులపైనా స్పెషల్ ఫోకస్
- పక్కా ఆధారాలతో న్యాయ పోరాటం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో సుమారు రూ.60 వేల కోట్ల విలువైన వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. చెరువులు, కుంటలకు కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించి పునరుద్ధరిస్తున్నది. ఆయా చోట్ల కంచెలు ఏర్పాటు చేసి బోర్డులు పాతిస్తున్నది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు మెగా ఆపరేషన్స్ రియల్ ఎస్టేట్ మాఫియా, కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కొన్నిచోట్ల కోర్టుల నుంచి స్టే ఉత్తర్వులు తెచ్చుకొని ప్రభుత్వ చర్యలకు మోకాలడ్డుతున్న వ్యవహారాలపైనా యంత్రాంగం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆయా భూములు ప్రభుత్వానికి చెందినవేనని, చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలోనివేనని ఆధారాలతో రుజువు చేసి విజయం సాధిస్తున్నది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడాది కాలంలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో సుమారు రూ.60 వేల కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన వెయ్యి ఎకరాల భూములను సర్కారు స్వాధీనం చేసుకుంది. మొత్తం 460కి పైగా ఆక్రమణలను ప్రభుత్వం విడిపించగా, ఇందులో అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలతో పాటు పర్యావరణపరంగా కీలకమైన చెరువులు, నాలాల పరిధిలోని ఆక్రమణలూ ఉన్నాయి. స్టే కేసుల్లో మరింత పకడ్బందీగా..మాదాపూర్ సమీపంలో ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్మిస్తున్న రూ. 500 కోట్లకు పైగా విలువైన వాణిజ్య ప్రాజెక్టు.. నాలా బఫర్ జోన్‌ను ఆక్రమించిందని ప్రభుత్వం గుర్తించింది.
దీని కూల్చివేత నోటీసుపై సదరు కంపెనీ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. ఈ కేసులో స్టే ఎత్తివేత కోసం హైడ్రా పకడ్బందీగా జియో-రిఫరెన్సుడ్మ్యాప్లు, రెవెన్యూ, మున్సిపల్ పత్రాలతో కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఓ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు నిర్మించిన ఫామ్‌హౌస్‌ల కూల్చివేతపైనా కోర్టు స్టే కొనసాగుతున్నది. కబ్జాదారులు నకిలీ పత్రాలను సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ న్యాయ నిపుణులు ఈ ఫామ్‌హౌస్‌లు చెరువు భూమిలో ఉన్నాయని నిరూపించడానికి చారిత్రక రికార్డులు, 1950ల నాటి సర్వే వివరాలను కోర్టుకు సమర్పించే పనిలో ఉన్నారు. కోర్అర్బన్ఏరియాలో ఒక మున్సిపాలిటీ పరిధిలో పాత పద్ధతిలో పొందిన అనుమతులతో నిర్మించిన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌కు సంబంధించిన కూల్చివేత నోటీసుపైనా స్టే తెచ్చున్నారు.
ఈ క్రమంలో ఆ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు చట్టబద్ధంగా చెల్లవని, ఎఫ్‌టీఎల్ నిబంధనలను ఉల్లంఘించాయని నిరూపించేందుకు హైడ్రా పాత మున్సిపల్ రికార్డులను పరిశీలిస్తున్నది. గండిపేట సమీపంలోని పీరం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో 2000 సంవత్సరంలో పొందిన పాత లేఅవుట్ అనుమతులను ఆధారంగా చేసుకుని ఒక బిల్డర్ ప్రాజెక్టును మొదలుపెట్టగా, చెరువును ఆక్రమించి కడ్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. దీంతో బిల్డర్ స్టే తెచ్చుకోగా, పాత అనుమతులు ఉన్నా, అవి చెరువుల రక్షణ చట్టం వాల్టా యాక్ట్‌ను అతిక్రమించినందున చెల్లవని నిరూపించడానికి హైడ్రా న్యాయ పోరాటం చేస్తున్నది. జీడిమెట్ల ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన స్థానిక కబ్జాదారులు నకిలీ పట్టాలతో అక్కడ ఇళ్లు నిర్మించారు. హైడ్రా కూల్చివేతకు వెళ్లగా, సదరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించి, తమకు అసైన్డ్ ల్యాండ్ అని వాదిస్తూ స్టే తెచ్చుకున్నారు. ఆ భూమి అసైన్డ్ ల్యాండ్ కాదని, నిస్సారమైన ప్రభుత్వ భూమి అని నిరూపించడానికి రెవెన్యూ అధికారులు ఒరిజినల్ రికార్డులను కోర్టుకు సమర్పించడానికి ప్రయత్నిస్తున్నారు.
విలువైన భూములు ఒక్కొక్కటిగా స్వాధీనం..
- మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా గాజులరామారంలో హైడ్రాతో కలిసి సర్కార్ మెగా ఆపరేషన్ చేపట్టింది. ఈ ఒకే ఒక్క ఆపరేషన్‌తో సుమారు 317 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున అక్రమ వెంచర్లు, లేఅవుట్‌లు, తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేశారు. ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.15 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.
- రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ (సర్వే నం. 59)లో సుమారు రూ.3,600 కోట్ల విలువైన 36 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. నకిలీ పత్రాల ఆధారంగా ఈ భూమిపై కబ్జాదారులు హక్కులు సంపాదించారు. దీంతో జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. విచారణలో ఆ పట్టాలు నకిలీవని గుర్తించిన హైకోర్టు.. ఆ భూమి ప్రభుత్వానికే చెందుతుందని తీర్పునిచ్చింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా.. ఆక్రమణలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకుంది.
- హయత్‌నగర్ పరిధిలోని ఒక పెద్ద లేఅవుట్‌లో 2 ఎకరాల ఓపెన్ స్పేస్ (పార్కు కోసం కేటాయించిన స్థలం)లో కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపట్టారు. స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు స్పందించిన హైడ్రా.. నిర్మాణాలను కూల్చివేసి స్థలాన్ని తిరిగి మున్సిపాలిటీకి అప్పగించింది.
- బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థానిక రెవెన్యూ అధికారుల సాయంతో కొంతమంది రియల్టర్లు ఆక్రమించారు. ఈ స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించే ప్రయత్నం చేయగా.. రంగంలోకి దిగిన అధికారులు ఆక్రమణదారుల చెరవిడిపించి, స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఉందనే అనుమానాలతో ప్రభుత్వ విచారణ ప్రారంభమైంది.
- పహాడీ షరీఫ్ ప్రాంతంలో కోమటికుంట చెరువు క్యాచ్‌మెంట్ ఏరియాలో పెద్ద సంఖ్యలో ఫామ్‌హౌస్‌లు, విల్లా ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. అధికారులు రెవెన్యూ, ఇరిగేషన్ డాక్యుమెంట్ల ఆధారంగా 45 ఎకరాల చెరువు ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి అంచనా విలువ సుమారు రూ.900 కోట్లుగా ఉన్నట్లు గుర్తించారు.
- శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో భవిష్యత్ అవసరాల కోసం కేటాయించిన అత్యంత విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక మాజీ రాజకీయ నాయకుడి అనుచరులు కబ్జా చేశారు. రూ.1,200 కోట్లకు పైగా విలువైన ఈ స్థలాన్ని ఇటీవలే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో న్యాయపోరాటంతో చట్టపరమైన చిక్కులను అధిగమించింది.
అత్యంత విలువైన భూములే..
హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ప్రభుత్వానికి అత్యంత విలువైన భూములు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో భూముల రేట్లు కోట్లకు చేరడంతో స్థానిక రాజకీయ నాయకులు, రియల్టర్లు, బిల్డర్లు, కబ్జాదారుల అండతో ప్రభుత్వ స్థలాలను, చెరువులు, కుంటల శిఖం భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. సిటీ పరిధిలోనైతే నాలాలు, రోడ్లు, పార్కులు, ఆఖరికి పుట్‌పాత్‌లను కూడా వదల్లేదు. ఎకరా రూ.100 కోట్లు ఉన్న ప్రాంతాల్లోనూ సర్కార్ల్యాండ్స్ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లాయి. వీటిని కాపాడేందుకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, హైడ్రా వంటి సంస్థలు జియో-రిఫరెన్స్‌డ్ మ్యాప్‌లు, చారిత్రక రికార్డులను ఆధారంగా చేసుకొని న్యాయ పోరాటం చేయాల్సి వస్తున్నది. ఈ ఆక్రమణల వల్ల పర్యావరణానికి, జల వనరులకు పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు కోర్టుల్లో వాదిస్తున్నారు. ఇప్పటికే సిటీలో నాలా, రోడ్లు, పార్కుల కబ్జాతో అధిక వర్షాలు, వరదలతో కాలనీలు జలమయవుతున్న తీరును ఆధారాలతో వివరిస్తున్నారు.