Kantara Chapter 1' Box Office 'కాంతార చాప్టర్ 1' దెబ్బకు బాక్సాఫీస్ రికార్డు బ్రేక్!.. మూడు రోజుల్లోనే వందల కోట్ల క్లబ్బులో రిషబ్ శెట్టి!

Kantara Chapter 1' Box Office  'కాంతార చాప్టర్ 1' దెబ్బకు బాక్సాఫీస్ రికార్డు బ్రేక్!..  మూడు రోజుల్లోనే వందల కోట్ల క్లబ్బులో రిషబ్ శెట్టి!

కన్నడ సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన హోంబాలే ఫిల్మ్స్ మరోసారి అసాధారణ విజయాన్ని అందుకుంది. నటుడు, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి తెరకెక్కించి, నటించిన పీరియడ్ ఫోక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'కాంతార చాప్టర్ 1' (Kantara Chapter 1)  దసరా సందర్భంగా అక్టోబర్ 2 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.235 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ రికార్డులు ఇప్పుడు ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తోంది.

 కలెక్షన్స్ ప్రభంజనం

పాజిటివ్ టాక్ తో 'కాంతార చాప్టర్ 1'కు తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.  సాక్నిల్క్ ప్రకారం భారీ ఓపెనింగ్‌గా తొలి రోజు సుమారు రూజ88 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, శుక్రవారం కొద్దిగా తగ్గి రూ.64 కోట్ల గ్రాస్‌ను సాధించింది. మూడో రోజు (శనివారం) కలెక్షన్లలో ఏకంగా 25 శాతానికి పైగా పెరిగి..  బలమైన వృద్ధిని కనబరిచింది. సుమారు రూ. 82 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసింది. దీంతో, మూడు రోజుల్లోనే ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా రూ.235 కోట్ల గ్రాస్‌ను దాటిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి..

►ALSO READ | Big Boss Telugu 9: బిగ్‌బాస్‌ తెలుగు 9: నాలుగో వారం సెన్సేషన్.. హౌస్‌ నుంచి 'మాస్క్ మ్యాన్' హరీష్ ఎలిమినేట్ !

ఈ వసూళ్లలో భారతదేశంలో రూ.195 కోట్లుగా ఉండగా, ఓవర్సీస్‌లో సుమారు రూ. 38 నుంచి రూ.39 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఆదివారం కూడా బుకింగ్స్ అద్భుతంగా ఉండటంతో, నాలుగు రోజుల పొడిగించిన తొలి వారాంతంలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

 

రికార్డు బ్రేక్..

'కాంతార చాప్టర్ 1' కలెక్షన్లు కేవలం వసూళ్ల వరకే పరిమితం కాలేదు, కన్నడ సినీ చరిత్రలోనే ఒక మైలురాయిని అధిగమించాయి. కేవలం మూడు రోజుల్లోనే యష్ నటించిన 'కేజీఎఫ్ చాప్టర్ 1' (ప్రపంచవ్యాప్తంగా రూ237 కోట్లు) లైఫ్‌టైమ్ కలెక్షన్లను అధిగమించే దిశగా ఈ చిత్రం దూసుకెళ్లింది. 'కాంతార' ( రూ.408 కోట్లు) - ఇది కూడా రిషబ్ శెట్టి సృష్టే.  'కేజీఎఫ్ చాప్టర్ 2' ( రూ. 1215 కోట్లు) - కన్నడ సినీ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది . ప్రస్తుతం'కాంతార చాప్టర్ 1' చిత్రం కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది.

రిషబ్ శెట్టి ఈ ప్రీక్వెల్‌లో కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ,  నటన పరంగా అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. తన మొదటి భాగం 'కాంతార' ఇచ్చిన విజయ స్ఫూర్తితో, పౌరాణిక,  సాంస్కృతిక అంశాలను మేళవించి, ప్రేక్షకులను మరోసారి దిగ్భ్రాంతికి గురిచేశారు. ఈ అనూహ్య విజయం కన్నడ సినిమాకు కొత్త శక్తిని ఇవ్వడమే కాకుండా, ఇండియన్ సినిమా గతిని మార్చేస్తోంది. ఈ వేగంతో వెళితే, 'కాంతార చాప్టర్ 1' సులభంగా రూ.400 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించడం ఖాయంగా కనిపిస్తోంది.

కథాంశం..

హోంబాలే ఫిల్మ్స్ (KGF ఫేమ్) నిర్మాణంలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, 2022 బ్లాక్‌బస్టర్ 'కాంతార'కు ప్రీక్వెల్గా వచ్చింది. ఇది క్రీ.శ. 300లో కదంబ రాజవంశం కాలంలో అడవులు, తెగల మధ్య సంఘర్షణ, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, భూత కోల ఆచారాల మూలాలను అన్వేషిస్తుంది. రిషబ్ శెట్టి శక్తివంతమైన యోధుడు బెర్మే అనే నాగ సాధువు పాత్రలో నటించగా, జయరామ్ విజయేంద్ర రాజుగా, రుక్మిణి వసంత్ కనకవతిగా,  గుల్షన్ దేవయ్య కులశేఖరగా నటించారు.

ఈ చిత్రం కేవలం విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసమే కాక, దానిలోని ఆధ్యాత్మిక లోతు, సాంస్కృతిక ప్రాతినిధ్యం కోసం సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు అందుకుంటోంది. 'కాంతార' ఫ్రాంచైజీ కేవలం వినోదం మాత్రమే కాక, మన సజీవ వారసత్వం, విశ్వాసం యొక్క ప్రతీకగా నిలిచిందని అభినందిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి .