Big Boss Telugu 9: బిగ్‌బాస్‌ తెలుగు 9: నాలుగో వారం సెన్సేషన్.. హౌస్‌ నుంచి 'మాస్క్ మ్యాన్' హరీష్ ఎలిమినేట్ !

 Big Boss Telugu 9: బిగ్‌బాస్‌ తెలుగు 9: నాలుగో వారం సెన్సేషన్.. హౌస్‌ నుంచి 'మాస్క్ మ్యాన్' హరీష్ ఎలిమినేట్ !

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రియాలిటీ షో హోరాహోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ ఆట ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుని, కీలక మలుపు తిరుగుతోంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ ప్రయాణంలో ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్స్ - శ్రేష్ఠి వర్మ (మొదటి వారం), మనీష్ మర్యాద (రెండో వారం), ప్రియా శెట్టి (మూడో వారం) వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ఈ తరుణంలో, హౌస్‌లోకి దివ్య నిఖితా రాయల్ కార్డ్ ఎంట్రీగా రావడంతో, నాలుగో వారం ఆట 13 మంది కంటెస్టెంట్స్‌తో రసవత్తరంగా మారింది.

ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్!

నాలుగో వారం నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. వారిలో దివ్య నిఖితా, హరీష్ హరిత, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైని, రీతూ చౌదరి, సంజన గల్రాని ఉన్నాయి.  అయితే ఈ ఆరుగురిలో ఎవరు ఉంటారు, ఎవరు వెళ్తారు అనేదానిపై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓటింగ్ ఫలితాల ప్రకారం, మొదట్నుంచీ స్ట్రాంగ్‌గా ఉన్న సంజన గల్రాని అత్యధిక ఓట్లతో టాప్ 1లో నిలిచింది. ఆ తర్వాత వరస స్థానాల్లో దివ్య, శ్రీజ, రీతూ చౌదరి నిలిచారు.

'మాస్క్ మ్యాన్' ప్రయాణం ముగిసింది!

అయితే, ఓటింగ్ ట్రెండ్‌లో చివరి రెండు స్థానాల్లో ఫ్లోరా సైని , హరీష్ హరిత నిలిచారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగడంతో, హరీష్, ఫ్లోరా ఇద్దరూ ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. అందరి అంచనాలకు భిన్నంగా, ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే జరిగింది, ఆ ఎలిమినేషన్ ప్రక్రియలో హరీష్ హరిత హౌస్‌ను వీడినట్లు సమాచారం. ఈ ఎలిమినేషన్ షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు, దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ను నేడు (అక్టోబర్ 5) ప్రసారం కానుంది.

మరి ముఖ్యంగా, హరీష్ హరిత ఎంట్రీ ప్రత్యేకంగా చర్చకు దారి తీసింది. 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష'లో మాస్క్ మ్యాన్‌గా అడుగుపెట్టిన హరీష్, తనను తాను 'మ్యాన్ ఆఫ్ హార్ట్', 'మ్యాన్ ఆఫ్ హ్యూమానిటీ' వంటి ట్యాగ్‌లతో పరిచయం చేసుకున్నారు. హౌస్‌లోకి కామనర్‌గా అడుగుపెట్టినప్పటికీ, హౌస్‌లో ఆయన ప్రవర్తన ఆయనకు మైనస్‌గా మారింది. అందరితో అనవసరంగా వాదనలకు దిగడం, టాస్క్‌లలో చురుకుగా పాల్గొనకపోవడం, ముఖ్యంగా హౌస్‌మేట్స్‌తో రూడ్‌గా వ్యవహరించడం వంటి కారణాలు ఆయన ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపాయని తెలుస్తోంది. మరి, హరీష్ ఎలిమినేషన్‌కు కారణాలేమిటి? నిజంగానే ఆయన ఆట అభిమానులను ఆకట్టుకోలేకపోయిందా? ఈ రోజు రాత్రి ప్రసారం కానున్న ఎపిసోడ్‌తో దీనిపై పూర్తి స్పష్టత రానుంది.