
బెంగళూరు: కర్నాటక రాజధాని నగరం బెంగళూరు శివార్లలో వివాహిత ఆత్మహత్య విషాదం నింపింది. బెంగళూరు నగర శివారు ప్రాంతమైన అవలహల్లిలోని తలఘట్టపుర ప్రాంతంలో నివాసం ఉంటున్న నవ్య, శైలేష్కు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. బెంగళూరు సిటీలో శైలేష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే.. గత కొంత కాలంగా శైలేష్, అతని కుటుంబం అదనపు కట్నం కోసం నవ్యను చిత్రహింసలకు గురిచేశారు.
ఆ మానసిక ఒత్తిడి భరించి.. భరించి.. ఇక తట్టుకోలేనని భావించి నవ్య ఉరేసుకుని చనిపోయింది. ఆమె భర్త గమనించి హాస్పిటల్లో జాయిన్ చేసినా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. శైలేష్, అతని కుటుంబం తమ కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తుందని నవ్య తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలకి పోలీసులను కోరారు. తలఘట్టపుర పోలీస్ స్టేషన్లో నవ్య తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
►ALSO READ | Coldrif Cough Syrup.. ఈ దగ్గు మందును ఎందుకు వాడొద్దంటున్నారంటే..
దేశంలో సగటున రోజుకు 19 మంది యువ మహిళలు వరకట్న భూతానికి బలవుతున్నట్లు నేషనల్ క్రైమ్ బ్యూరో గణాంకాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. 2020లో అదనపు కట్నం వేధింపులతో రోజుకు 19 మందికి పైగా చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక 2017-2022 మధ్య సగటున దేశ వ్యాప్తంగా ఏటా 7 వేలకు పైగా వరకట్న మరణాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. 2024లో నమోదైన మొత్తం 25 వేల 743 కేసుల్లో 4 వేల 383 కేసులు వరకట్న వేధింపులకు సంబంధించినవే.