
ప్రతి ఏటా జరిగే 80వ దశకపు సినిమా తారల రీయూనియన్ (The 80s Stars Reunion) పార్టీ ఈసారి మరింత ఉల్లాసంగా, ఘనంగా జరిగింది. భారతీయ వెండితెరపై ఒకప్పుడు వెలిగిన అగ్రనటులు, నటీమణులు అంతా ఒకేచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సంతోషంగా గడిపారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, సాండల్‌వుడ్‌కు చెందిన 31 మంది నటీనటులు హాజరై గ్రాండ్ గా జరుపుకున్నారు.
చీతా థీమ్‌లో మెరిసిన తారలు!
అక్టోబర్ 4న చెన్నై నగరంలో ఈ మెగా గెట్ టు గెదర్ వేడుక జరిగింది. అయితే ఈసారి ఆతిథ్యం ఇచ్చే అదృష్టం కోలీవుడ్ స్టార్ జంట రాజ్‌కుమార్ సేతుపతి , శ్రీప్రియలకు దక్కింది. వారి నివాసంలోనే ఈ పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది రీయూనియన్ పార్టీకి ఒక ప్రత్యేకమైన థీమ్ ప్లాన్ చేశారు. అదే... ఉత్సాహభరితమైన 'చిరుత (Chiruta)' థీమ్. పార్టీలో పాల్గొన్న దాదాపు 31 మంది నటీనటులు అంతా కూడా చీతా ప్రింట్ డిజైన్ చేసిన డ్రెస్సులలో మెరిసిపోయారు. ఒకే థీమ్‌లో తళుక్కున మెరిసిన సినీతారల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మధుర జ్ఞాపకాల వీధిలో..
ఈ సంబరానికి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నరేశ్ వంటి స్టార్స్ హాజరయ్యారు. చిరంజీవి ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంటూ, "80's స్నేహితులతో ప్రతి రీయూనియన్ మధుర జ్ఞాపకాల వీధిలో ఒక నడకలా ఉంటుంది. నవ్వులు, ఆప్యాయత, పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆనందం, ప్రేమతో గడుస్తుంది. ఎన్ని సార్లు కలిసినా, ప్రతి సారి కొత్తగా, మొదటిసారి కలిసినట్టే సంతోషంగా అనిపిస్తుంది" అంటూ ఫోటోలను షేర్ చేశారు.
ఆట పాటలతో సందడి..
కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్‌తో పాటు బాలీవుడ్ నుంచి కూడా అగ్రనటులు ఈ పార్టీకి విచ్చేశారు. జాకీ ష్రాఫ్, మీనా, శరత్‌కుమార్, నదియా, రాధ, సుహాసిని, రమ్యకృష్ణ, జయసుధ, సుమలత, ఖుష్బూ, లిస్సీ, శోభన, మేనక, సురేశ్, భాను చందర్, ప్రభు, రెహ్మాన్, రేవతి వంటి ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. పాత తరం తారలంతా కలిసి సరదా ఆటలు, పాటలు, డ్యాన్సులతో కాలక్షేపం చేశారు.
రీయూనియన్ చరిత్ర..
ఈ '80s స్టార్స్ రీయూనియన్' సంప్రదాయం 2009లో మొదలైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా జరుగుతోంది. కానీ 2023లో రీయూనియన్ జరగలేదు, 2024లో చెన్నైలో వరదల కారణంగా పార్టీని వాయిదా వేయడంతో, చాలాకాలం తర్వాత ఈసారి ఘనంగా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశారు. సినిమా పరిశ్రమలో భిన్నమైన భాషలు, ప్రాంతాలు ఉన్నప్పటికీ, ఈ "80s Stars Reunion" మాత్రం స్నేహం, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం వంటి విలువలకు ప్రతీకగా నిలుస్తూ... ఆ తరం తారల మధ్య బంధాన్ని దృఢంగా ఉంచుతోంది. అభిమానులకు కూడా ఈ స్టార్స్ పాత రోజులను గుర్తు చేస్తూ సరికొత్త అనుభూతిని పంచుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రీయూనియన్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.