
ఆస్ట్రేలియా అండర్-19 బ్యాటర్ హర్జాస్ సింగ్ శనివారం (అక్టోబర్ 4) సిడ్నీ గ్రేడ్ క్రికెట్‌లో విధ్వంసం సృష్టించాడు. ఇప్పటివరకు డబుల్ సెంచరీ చేస్తేనే అతి పెద్ద ఘనత అనుకుంటే అంతకు మించి తొలిసారి వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. సిడ్నీ క్రికెట్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్రన్ సబర్బ్స్ తరపున ఆడుతున్న హర్జాస్ ప్రపంచ క్రికెట్ విస్తుపోయేలా బ్యాటింగ్ చేశాడు. 141 బంతుల్లో 314 పరుగులు చేసి ఔరా అనిపించాడు. హర్జాస్ సింగ్ ఇన్నింగ్స్ లో 35 సిక్సర్లు ఉండడం విశేషం. కేవలం సిక్సర్లతోనే 210 పరుగులు రాబట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఈ మ్యాచ్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ దిగిన హర్జాస్ 35వ ఓవర్లో 74 బంతుల్లో తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. అతని సెంచరీ తర్వాత అసలు విధ్వంసం మొదలయింది. ఆ తర్వాత హర్జాస్ అసాధారణంగా ఆడాడు. కేవలం 67 బంతుల్లోనే 214 పరుగులు చేశాడంటే అతని విధ్వంసం ఏ రేంజ్ లో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ తో తమ జట్టు ఏకంగా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 483 పరుగులు చేసింది. హర్జాస్ ట్రిపుల్ సెంచరీతో సత్తా చాటగా.. మరే బ్యాటర్ కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేదు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సిడ్నీ 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు మాత్రమే చేసి 196 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.
హర్జాస్ సింగ్ తన ఇన్నింగ్స్ తర్వాత మాట్లాడుతూ ఇలా అన్నాడు.. "ఖచ్చితంగా నేను ఇప్పటివరకు చూసిన అత్యంత క్లీన్ బాల్-స్ట్రైకింగ్ ఇదే. ఇది నాకు చాలా గర్వకారణం ఎందుకంటే నేను ఆఫ్-సీజన్‌లో నా పవర్-హిట్టింగ్‌పై చాలా కష్టపడ్డాను. ఈ రోజు ఇలాంటి ఇన్నింగ్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇది చాలా ప్రత్యేకమైనది. గత ఒకటి లేదా రెండు సీజన్లలో నేను ఆడలేకపోయాను. బయట విషయాలు గురించి ఆలోచిస్తూ చింతించాను". అని సింగ్ మ్యాచ్ తర్వాత ఫాక్స్ క్రికెట్‌తో అన్నాడు.
►ALSO READ | IND VS PAK: ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌కు వింత సమస్య.. గ్రౌండ్లోకి ఈగలు రావడంతో ఆటకు అంతరాయం
ఫిబ్రవరి 2024లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సింగ్ ఉన్నాడు. ఫైనల్లో ఇండియాతో జరిగిన ఆ మ్యాచ్ లో 55 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలివడం విశేషం. ఈ 20 ఏళ్ళ ఆసీస్ ఆటగాడు త్వరలోనే జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది . భారత సంతంతికి చెందిన ఈ యువ సంచలనం ప్రస్తుతం తన ఇన్నింగ్స్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు