IND VS PAK: ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌కు వింత సమస్య.. గ్రౌండ్‏లోకి ఈగలు రావడంతో ఆటకు అంతరాయం

IND VS PAK: ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌కు వింత సమస్య.. గ్రౌండ్‏లోకి ఈగలు రావడంతో ఆటకు అంతరాయం

కొలంబో వేదికగా ఇండియా, పాకిస్థాన్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆటకు అంతరాయం కలిగింది. ఆదివారం (అక్టోబర్ 5) జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఒక వింత కారణం వలన మ్యాచ్ ఆగిపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రౌండ్ లో అధిక సంఖ్యలో ఈగలు ప్లేయర్లకు ఇబ్బంద కలిగించడంతో అంపైర్లు చిన్నపాటి విరామాన్ని ప్రకటించారు. బ్యాటింగ్ చేస్తున్న హర్లీన్ డియోల్ దగ్గర నుండి బౌదరే దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న నష్రా సంధు వరకు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోకి ఈగలు గుంపుగా చొరబడటంతో రెండు జట్ల ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. 
 
20వ ఓవర్ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్, హర్లీన్ డియోల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈగలు గ్రౌండ్ లోకి వచ్చాయి. 28వ ఓవర్‌లో సంధు బౌలింగ్‌కు వచ్చినప్పుడు అధిక సంఖ్యలో ఈగలు ఆటగాళ్లను చుట్టుముట్టాయి. తరచూ అంతరాయం కలిగిస్తుండటంతో టవల్ ఉపయోగించి ఈగలను తరిమికొట్టాల్సి వచ్చింది. పాకిస్థాన్ ప్రత్యామ్నాయ క్రీడాకారిణి ఫాతిమా సనా స్ప్రేతో మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ స్ప్రేను పురుగులకు చల్లి తరిమికొట్టే ప్రయత్నం చేసింది. ఈ సమస్య ఎక్కువ కావడంతో ఈ ఓవర్ చివరి బంతికి ముందు ఆటగాళ్ళు అంపైర్ల సహాయం కోరగా మ్యాచ్ కు చిన్నపాటి విరామం ఇచ్చారు.   

ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ తీసుకోవడంతో ఇండియా బ్యాటింగ్ చేస్తుంది. ప్రస్తుతం 35 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా బ్యాటింగ్ లో తడబడుతోంది. హర్లీన్ డియోల్ 46 పరుగులు చేసి రాణించింది. జెమిమా రోడ్రిగ్స్ (32), ప్రతీక రావల్ (31) పర్వాలేదనిపించారు.