ప్రచారం సమాప్తం: ముగిసిన లోక్సభ క్యాంపెయిన్

ప్రచారం సమాప్తం: ముగిసిన లోక్సభ క్యాంపెయిన్
  • ప్రధాన ప్రచారాస్త్రంగా  రాజ్యాంగం
  • కీలకంగా మారిన రిజర్వేషన్ల అంశం
  • ఎల్లుండి చివరి విడుత పోలింగ్
  • జూన్1 6.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్

ఢిల్లీ: హోరాహోరీగా సాగిన లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. జూన్ 1న 8 రాష్ట్రాల్లోని 57 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. చివరి దశ ఎన్నికల్లో మొత్తం 904 మంది  పోటీ పడుతున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. దీంతో లోక్ సభ ఎన్నికల అంకంలో ప్రచార పర్వానికి తెరపడినట్లయింది. ఈ సారి ఎన్నికల్లో  రాజ్యంగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల రద్దు అంశం కీలకంగా మారింది.

రామ మందిరం నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ చివరకు రిజర్వేషన్లు రద్దు చేయం.. రాజ్యాంగాన్ని కాపాడుతామని వివరణ ఇచ్చుకునే దిశగా టర్న్ అయ్యింది. రిజర్వేషన్ల రద్దు అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదట బయటపెట్టారు. అబ్ కీ బార్ చార్ సౌ పార్ అనే నినాదం వెనుక ఉన్న మతలబును, ఆర్ఎస్ఎస్ విధానాన్ని ఆధారాలతో బయటపెట్టడంతో ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అంతా రిజర్వేషన్ల అంశమే కేంద్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకాన్ని వెంట పెట్టుకొని ప్రచారానికి వెళ్లారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ఇండియా కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

ఎల్లుండి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్

మీడియా, సర్వే సంస్థలు ఎన్నికల వేళ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసీ ఆంక్షల కారణంగా వాటిని ప్రసారం చేయలేదు. బయట పెట్టలేదు. జూన్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తుది విడుత పోలింగ్ కొనసాగనుంది.సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ కు ఈసీ అనుమతిం చింది. ఆ రోజు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించనున్నాయి.